Heavy Rains: పాకిస్తాన్‌ను ప్రస్తుతం కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించి తీవ్ర నష్టం వాటిల్లింది. గత 24 గంటల్లో పాకిస్తాన్ వ్యాప్తంగా కనీసం 54 మంది మరణించగా, జూన్ చివరి నుండి రుతుపవన సంబంధిత మరణాల సంఖ్య సుమారు 180 కి చేరింది. మరణించిన వారిలో 70 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. 500 మందికి పైగా గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్ అత్యంత ఎక్కువగా ప్రభావితమైంది. ఇక్కడ ఒక్క రోజే 30 మందికి పైగా మరణించారు. లహోర్, ఫైసలాబాద్, ఒకారా, సాహివాల్, పక్పత్తాన్, చక్వాల్ వంటి నగరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.
చక్వాల్ జిల్లాలో 24 గంటల్లో 423 మి.మీ వర్షపాతం నమోదైంది, ఇది ప్రావిన్స్‌లో అత్యధికం. రావల్పిండి, లహోర్ సహా పలు నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల కార్లు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా బలహీనమైన ఇళ్ల పైకప్పులు కూలిపోవడం, గోడలు కూలిపోవడం వల్ల చాలా మరణాలు సంభవించాయి. జీలం నది, ఇతర వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ప్రజలను సైన్యం, రెస్క్యూ బృందాలు హెలికాప్టర్లు, పడవలతో రక్షిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu: నేడు సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర షెడ్యూల్ ఇదే..
పంజాబ్ ప్రభుత్వం పలు జిల్లాల్లో “వర్ష అత్యవసర పరిస్థితి” ప్రకటించింది. అధికారులు నదుల పక్కన నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని ఆదేశించారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) మరియు పాకిస్తాన్ వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని, వరదలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశాయి. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, సహాయక బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఆసుపత్రులు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.