Hyderabad Rain: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న నగరవాసులకు వరుణుడు చల్లని కబురు అందించాడు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, సాయంత్రానికి నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవగా, గచ్చిబౌలి పరిసరాల్లో వడగళ్ల వాన పడటం విశేషం. ఈ అకాల వర్షంతో అప్పటివరకు ఉన్న ఉక్కపోత తగ్గి, వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది.
అయితే, ఈ వర్షం నగరవాసులకు కొంత ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, ప్రయాణికులకు మాత్రం చుక్కలు చూపించింది. ఏకధాటిగా కురిసిన వానకు ఎస్‌ఆర్ నగర్, మియాపూర్, కూకట్‌పల్లి, చందానగర్ వంటి ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మోకాళ్ల లోతు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వేసవి కాలం ప్రారంభంలోనే ఎండలు ముదురుతుండటంతో బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలకు, ఈ వర్షం పెద్ద ఊరటనిచ్చింది. చల్లని గాలులు వీస్తుండటంతో చిన్నారులు, పెద్దలు ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎండ వేడి నుంచి తాత్కాలికంగా విముక్తి లభించినప్పటికీ, వర్షం కారణంగా రోడ్లపై నిలిచిన నీటి వల్ల వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రానున్న మరికొద్ది గంటల పాటు నగరంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
