భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది.వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండల మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884.90 అడుగులకు చేరింది. అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
మరో పక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది. దీంతో 12 గేట్లు అయిదు అడుగుల మేర ఎత్తి 97 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అయిదు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.
కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు ఎవరూ నదిలో చేపల వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. కృష్ణా నదికి భారీ వరద చేరడంతో విజయవాడ నగర వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మొన్న వచ్చిన వరద మరవక ముందే మళ్ళీ వరద రావడంతో టెన్షన్ కు గురవుతున్నారు.