IND vs SA T20

IND vs SA T20: లఖ్‌నవూలో భారత్–దక్షిణాఫ్రికా నాలుగో టీ20 రద్దు

IND vs SA T20:  లఖ్‌నవూ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ వాతావరణం అనుకూలించక అర్ధాంతరంగా నిలిచిపోయింది. మైదానాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు కారణంగా బుధవారం రాత్రి ఎకానా స్టేడియంలో ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయింది. కనీసం టాస్ వేసే పరిస్థితి కూడా లేకపోవడంతో స్టేడియానికి వచ్చిన వేలాది మంది అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.

మ్యాచ్ ప్రారంభం కావాల్సిన సమయం నుండి రాత్రి 9:25 గంటల వరకు అంపైర్లు సుమారు ఆరుసార్లు మైదానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఫ్లడ్ లైట్లు వెలుగుతున్నా, కనీసం ఎదురుగా ఉన్న వారు కూడా కనిపించనంతగా మంచు కురవడంతో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అధికారికంగా ప్రకటించారు. లఖ్‌నవూలో ప్రస్తుతం వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయిలో ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది.

Also Read: Amaravati: ప్రపంచకప్ విజేత శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి

నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉత్తర భారతంలో చలి తీవ్రత, పొగమంచు అధికంగా ఉంటాయని తెలిసి కూడా అక్కడ మ్యాచ్‌లు నిర్వహించడంపై క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ సిరీస్ వేదికలను, జనవరిలో న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్ వేదికలతో మార్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో న్యూజిలాండ్ సిరీస్ కోసం ఎంపిక చేసిన విశాఖపట్నం, తిరువనంతపురం, రాజ్‌కోట్ వంటి నగరాల్లో ప్రస్తుతం వాతావరణం క్రికెట్‌కు అనుకూలంగా ఉండేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. గత వారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో కూడా తీవ్రమైన చలి కారణంగా ఆటగాళ్లు ఎంతో ఇబ్బంది పడ్డారు.

సిరీస్ రేసులో భారత్ ముందంజ
ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ రద్దు కావడంతో భారత్ ఈ సిరీస్‌ను కోల్పోయే అవకాశం లేదు. సిరీస్ విజేత ఎవరో తేలాలంటే శుక్రవారం అహ్మదాబాద్‌లో జరిగే ఐదో టీ20 మ్యాచ్ కీలకం కానుంది. ఆఖరి పోరులో భారత్ గెలిస్తే 3-1తో ట్రోఫీని కైవసం చేసుకుంటుంది, ఒకవేళ దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే సిరీస్ 2-2తో సమం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *