Encounter

Encounter: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..12 మంది మావోలు మృతి

Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మరణించారు. కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలపైకి మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఈ భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలకమైన ‘కొంటా ఏరియా కమిటీ’ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు తెలుస్తోంది.

ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు వంటి అగ్రశ్రేణి నాయకులు ఉండటం గమనార్హం. మరణించిన మావోయిస్టులలో ఎక్కువ మందిపై ప్రభుత్వం భారీ రివార్డులను కూడా ప్రకటించి ఉంది. ఎదురుకాల్పుల అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన భద్రతా బలగాలు అక్కడ మూడు ఏకే-47 రైఫిళ్లతో పాటు ఇన్సాస్ రైఫిళ్లు, భారీ పరిమాణంలో పేలుడు పదార్థాలు ఇతర ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టు పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా భద్రతా అధికారులు భావిస్తున్నారు.

Also Read: KTR: రాష్ట్ర‌వ్యాప్తంగా ఆటో డ్రైవ‌ర్ల అరెస్టు.. కేటీఆర్ తీవ్ర ఖండ‌న‌

మరోవైపు, బీజాపూర్ జిల్లాలో జరిగిన వేరొక ఎదురుకాల్పుల ఘటనలో కూడా ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సుక్మా జిల్లాలో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు మరింతగా నిఘాను పెంచాయి. కాల్పుల అనంతరం అడవిలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉన్నారనే అనుమానంతో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ భారీ ఎన్‌కౌంటర్ కారణంగా ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *