YS Jagan: పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మరణించడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆయన టీమ్‌పై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేసుపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. జగన్‌తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వరరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినిలు కూడా అదే కేసులో నిందితులుగా ఉండటంతో, వీరిలో చాలామంది హైకోర్టులో తమపై నమోదైన కేసులు రద్దు చేయాలంటూ పిటిషన్లు వేశారు.
గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపిన ప్రకారం, సంఘటన జరిగిన సమయంలో సింగయ్య ఓ వాహనం కింద పడిన దృశ్యాలు క్లియర్‌గా సీసీ టీవీ ఫుటేజ్, డ్రోన్ వీడియోల ద్వారా లభ్యమయ్యాయి. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Road Accident: సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ పోలీసులు మృతి
ఈ కేసు ఫిర్యాదు సింగయ్య భార్య లూర్ధు మేరీ ద్వారా నమోదైంది. తొలుత సింగయ్యను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే అనంతరం జరిగిన దర్యాప్తులో జగన్ కాన్వాయ్‌లోని వాహనం నుండి ప్రమాదం జరిగిందని స్పష్టత వచ్చింది.
ఇదిలా ఉంటే, జగన్ ఇవాళ బెంగుళూరుకు వెళ్లనున్నట్టు సమాచారం. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం బెంగుళూరులోని తన నివాసానికి చేరుకుంటారు.

