Kadiyam Srihari: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌పై రేపు కీలక అడుగు పడనుంది. ఆయనపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు స్పీకర్ తన ఛాంబర్‌లో ఈ విచారణను చేపడతారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన కడియం శ్రీహరి, ఆ తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారినందుకు గాను ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ విచారణలో భాగంగా, ఫిర్యాదు చేసిన కేపీ వివేకానంద గౌడ్ వాదనలను స్పీకర్ మొదటగా నమోదు చేస్తారు. కడియం శ్రీహరి పార్టీ మార్పు నిబంధనలకు విరుద్ధంగా ఎలా జరిగిందనే అంశంపై వివేకానంద తన దగ్గర ఉన్న ఆధారాలను స్పీకర్ ముందు ఉంచనున్నారు. ఈ విచారణ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
