Healthy Eating: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో, సరైన సమయానికి తీసుకోవడం కూడా అంతే అవసరం. వేళ తప్పి భోజనం చేస్తే అది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో సరైన సమయానికే భోజనం చేయాలి. మరీ ముఖ్యంగా రాత్రిపూట త్వరగా భోజనం చేస్తే మనిషి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. లేదంటే విపరీతాలకు దారితీస్తుంది.
Healthy Eating: రోజూ వేళకు భోజనం చేస్తేనే అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేసేవారికి అనారోగ్యాలు దరి చేరుతాయని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే రాత్రిపూట ఎంత వీలైతే అంత ముందుగా భోజనం ముగిస్తే అంతగా ప్రయోజనం కలుగుతుందని వారు సలహా ఇస్తున్నారు. అలా చేయకుంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళ త్వరగా భోజనం చేస్తే కలిగే 7 ప్రయోజనాలు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1) రాత్రి వేళ 7.30 గంటలలోపు భోజనం ముగించడం వల్ల అధిక బరువు తగ్గుతారు. మనం తిన్న ఆహారం నుంచి వచ్చే శక్తిని సరఫరా చేసేందుకు తగిన సమయం ఉంటుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది.
2) రాత్రి పూట త్వరగా భోజనం చేయడం వల్ల శరీంరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో స్థూలకాయం బారిన పడకుండా ఉంటారు.
3) రాత్రి వేళ త్వరగా భోజనం చేసే వారికి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చారు. త్వరగా భోజనం చేసే పురుషుల్లో 26 శాతం, మహిళలకు 16 శాతం వరకు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
4) రాత్రి త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రిస్తే ఉదయాన్నే శక్తివంతంగా, తేలికగా శరీరం ఉంటుంది. కొందరికి ఉదయం నిద్రలేవగానే బద్దకంగా ఉంటుంది. ఏపని చేయాలన్నా చేయబుద్ధికాదు. అలాంటి వారు రాత్రివేళ త్వరగా భోజనం ముగించి నిద్రిస్తే మరుసటిరోజు త్వరగా నిద్రలేస్తారు. బద్దకం వీడుతుంది.
5) రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారాన్ని సరిగా జీర్ణం చేసేందుకు కావాల్సిన సమయం ఉంటుంది.
6) రాత్రి త్వరగా భోజనం చేస్తే నిద్ర చక్కగా పడుతుంది. భోజనానికి, నిద్రకు 3 గంటల వ్యవధి ఉంటే సుఖ నిద్ర వస్తుంది.
7) రాత్రిపూట త్వరగా భోజనం చేసేవారికి గుండెజబ్బులు, హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు తేల్చారు. అందుకే రాత్రి వేళల్లో త్వరగా భోజనం ముగించాలని ఆరోగ్య నిపుణులు, సైంటిస్టులు సూచిస్తున్నారు.
