Kamareddy: కామారెడ్డి పట్టణంలో ఒళ్లు గగుర్పొడిచే దారుణం వెలుగుచూసింది. గుర్తుతెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపి, మృతదేహాన్ని ముక్కలు చేసి పడేశారు. పట్టణంలోని ఒక ప్రార్థనా మందిరం సమీపంలో ఉన్న చెత్తకుప్పలో ఈ మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఒక సంచిలో మృతదేహానికి సంబంధించిన కాళ్లు, మొండెం భాగాలు మాత్రమే ఉన్నాయి. తల, చేతులు కనిపించకపోవడంతో ఆ ప్రాంతమంతా గాలింపు చేపట్టారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టి, మృతదేహం సగభాగాన్ని ఇక్కడ పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్య ఎక్కడ జరిగింది? చనిపోయిన వ్యక్తి ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో కామారెడ్డి పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
