Pakistan Spy Arrested: భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ నిఘా సంస్థ ISI తరఫున గూఢచర్యం చేస్తున్న ముఠా రెచ్చిపోతోంది. పానిపట్ తరువాత, ఇప్పుడు హర్యానా రాష్ట్రంలోని కైతాల్ జిల్లాలో మరో కీలక అరెస్ట్ జరిగింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత దేశ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ISIకి లీక్ చేస్తున్న ఓ యువకుడు పోలీసులు వలలో చిక్కాడు.
కైతాల్ జిల్లాలోని మస్త్‌గఢ్ గ్రామానికి చెందిన దేవేంద్ర సింగ్ (25), పాకిస్తాన్ నిఘా సంస్థతో సంబంధాలు కలిగి గూఢచారిగా పనిచేస్తున్నట్టు నిర్ధారణ అయింది. కైతాల్ ఎస్పీ, ఐపీఎస్ అధికారి ఆస్తా మోడీ వెల్లడించిన సమాచారం ప్రకారం, దేవేంద్ర సింగ్ గత సంవత్సరం నవంబర్‌లో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లి, అక్కడ ISI అధికారితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆ పరిచయం అతన్ని దేశద్రోహ మార్గంలో నడిపించిందని అధికారులు అనుమానిస్తున్నారు.
ఫేస్‌బుక్ పోస్ట్ నుంచి గూఢచారి అరెస్ట్ వరకు:
మే 12న దేవేంద్ర సింగ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో తుపాకులు, పిస్టల్స్ ఫోటోలు షేర్ చేయడంతో పోలీసులు అతడిపై అనుమానం వ్యక్తం చేసి అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ సమయంలో, అతను ISIకి సమాచారం పంపుతున్నట్టు ఒప్పుకున్నాడు. అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విచారణకు పంపించామని, బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నామని ఎస్పీ ఆస్తా మోడీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌లో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా ఉండే ప్లేస్.. ఎక్కడో తెలుసా..?
ఆపరేషన్ సిందూర్ సమాచారం లీక్ చేసిన అనుమానం:
కైతాల్ డీఎస్పీ వీర్భన్ ప్రకారం, దేవేంద్ర ISIతో నేరుగా టచ్‌లో ఉండి, భారతదేశం – పాకిస్తాన్ మధ్య సాగుతున్న సైనిక కార్యకలాపాలపై, ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ గురించి పాకిస్తాన్ సైన్యం, ISIకి సమాచారం అందించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును సైబర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అత్యంత నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు.
ISI ముఠా ముసుగు చీల్చుతున్న భారత పోలీసులు:
ఇప్పటికే పానిపట్‌లో 24 ఏళ్ల నౌమాన్ ఇలాహిని, పాకిస్తాన్ తరపున గూఢచారిగా వ్యవహరిస్తున్నట్టు నిర్ధారించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్‌సర్‌లో భారత సైనిక స్థావరాల గురించి ISIకి సమాచారం అందించారనే ఆరోపణలపై, పంజాబ్‌లో పాలక్ షేర్ మాసిహ్, సూరజ్ మాసిహ్ అనే ఇద్దరు వ్యక్తులు ఇటీవల అరెస్ట్ అయ్యారు.
ఈ ఘటనలన్నీ పాకిస్తాన్ నిఘా సంస్థ ISI భారతదేశంలోని సున్నిత సమాచారాన్ని ఏ విధంగా సేకరించేందుకు ప్రయత్నిస్తున్నదీ బహిర్గతం చేస్తున్నాయి. అంతర్గత భద్రతను గణనీయంగా ప్రభావితం చేసే ఈ కేసులపై కేంద్రం, రాష్ట్రాల నిఘా సంస్థలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.