Harish Rao:రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు (మార్చి 21) కీలక చర్చ జరుగుతున్నది. మార్చి 19న రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శుక్రవారం చర్చను ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభంకాగానే తొలుత ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి చర్చను ప్రారంభించే అవకాశం కల్పించారు. ఈ మేరకు బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బడ్జెట్‌పై చర్చలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Harish Rao:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో లోపాలను ఎత్తిచూపుతూ హరీశ్‌రావు తన చర్చను కొనసాగించారు. గత ఎన్నికలకు ముందు నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక మాత్రం ఎల్ఆర్ఎస్‌ను ప్రజల ముక్కుపిండి ఎందుకు వసూలు చేస్తున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నది దాటేదాక ఓడ మల్లయ్య, నది దాటిన తర్వాత బోడ మల్లయ్య అన్న సామెత ఈ కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా వర్తిస్తుంది.. అని ఎద్దేవా చేశారు.
Harish Rao:గతంలో ఫార్మాసిటీకి తాము భూములు సేకరిస్తుంటే.. అదే ప్రాంతాల్లో భట్టి విక్రమార్క, సీతక్క పాదయాత్ర చేసి భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారని, ఇప్పుడేమో ఇంకా 14 వేల ఎకరాల భూములను ఎలా లాక్కుంటున్నారని హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరోజు ప్రభుత్వ భూములను ఎలా అమ్ముతారని ప్రశ్నించిన ఇదే కాంగ్రెస్ నేతలు.. ఈ రోజు బరాబర్ భూములు అమ్ముతాము.. అని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Harish Rao:అనుముల వారి పాలనలో ఎన్ని భూములను ఖతం పట్టిస్తారో తెలియడం లేదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయడం ద్వారా రూ.30 వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారని ఆరోపించారు. ఇది ప్రజలను వంచించడం కాదా అని ప్రశ్నించారు. అప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక ఇప్పడు ఇంకోలా ఎలా స్ట్రాటజీ ఉంటుందని నిలదీశారు.
Harish Rao:ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు చేశారని, ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు.. అంటూ హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం 6,000 లోపు ఉద్యోగాలనే మాత్రమే ఇచ్చారని తెలిపారు. 17,516 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి, ఫిజికల్ టెస్టులు నిర్వహించి, ఫైనల్ పరీక్షలు నిర్వహించామని వివరించారు.
Harish Rao:ఎన్నికలు ఉన్నందున నియామకాలు చేయలేకపోయామని హరీశ్‌రావు చెప్పారు. ఆ నియామక పత్రాలను ఈ కాంగ్రెస్ పాలకులు ఇచ్చి తామే ఆ ఉద్యోగాలను ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. వంటంతా వండి పెట్టినంక గరిటె తిప్పి అంతా తామే వండినట్టు ఈ కాంగ్రెస్ నాయకులు తీరు ఉన్నదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల పాలనలో ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. గతంలో కరోనా కాలంలో తాము ఫీజు కింద రూ.18,500 కోట్లు రీయింబర్స్‌మెంట్ చేశామని చెప్పారు.
Harish Rao:కాంగ్రెస్ పాలనలో జాబ్ క్యాలెండర్ కాస్తా, జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మారిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడిగితే అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల వీపులు పగులకొడుతున్నారని తెలిపారు. జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఓ దశలో బుద్ధిమాంధ్యం అన్న హరీశ్‌రావు వ్యాఖ్యలతో అభ్యంతరాలు రావడంతో కూడా వివరణ ఇచ్చారు.
Harish Rao:అదే విధంగా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల విషయంపై కూడా హరీశ్‌రావు స్పందించారు. ఈ ప్రభుత్వం వచ్చాక పంచాయతీలకు నయాపైసా ఇవ్వకుండా, చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేయడం సరికాదని తెలిపారు. బిల్లులు అందక మాజీ సర్పంచులు సతమతం అవుతున్నారని, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
Harish Rao:సీఎం రేవంత్‌రెడ్డి నిండు సభలో బట్టలూడదీసి కొడతా అంటే ఏమీ అనలేదు.. తాను బుద్ధిమాంధ్యం అంటే అభ్యంతరం తెలుపడమేమిటి అంటూ హరీశ్‌రావు అడిగారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా అని హరీశ్‌రావు వేడుకున్నారు.

