Harish Rao: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం శాసనసభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎకరానికి రూ. 15 వేల పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి, ఇప్పుడు రైతులకు సుమారు రూ. 19 వేల కోట్లు బాకీ పడ్డారని ఆయన మండిపడ్డారు.
రైతు భరోసాపై నిలదీత
ప్రభుత్వం రైతులకు ఇస్తామన్న ‘రైతు భరోసా’ నిధులపై హరీష్ రావు స్పష్టత కోరారు. “ఎన్నికల ముందు ప్రతి రైతుకు ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. నాట్ల సమయంలో ఇవ్వాల్సిన ఈ నిధులను, ఇప్పుడు పంట కోతల సమయం వచ్చినా ఇవ్వట్లేదు. అసలు మీరు ఎగ్గొట్టిన ఈ రైతు భరోసా నిధులను ఎప్పుడు ఇస్తారో చెప్పాలి” అని డిమాండ్ చేశారు. రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆయన ఆరోపించారు.
పంట బీమాకు మోక్షం ఎప్పుడు?
ఈసారి బడ్జెట్లో పంట బీమా (Crop Insurance) ప్రస్తావనే లేకపోవడంపై హరీష్ రావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “గత బడ్జెట్లో ఇచ్చిన హామీలకు అతీగతీ లేదు. ఈ బడ్జెట్లో పంటల బీమాను పూర్తిగా ఎత్తేశారు. రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ఆదుకునే నాథుడే కరువయ్యారు. రెండున్నరేళ్లుగా గ్యారెంటీ హామీలు ఎందుకు అమలు కావట్లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని నిలదీశారు. ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు.
రుణమాఫీ లెక్కల్లో తేడాలు
రుణమాఫీపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి అస్సలు సంబంధం లేదని హరీష్ రావు పేర్కొన్నారు. “వేల మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు. కానీ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాటలు చూస్తుంటే ‘అర్థాలే వేరులే’ అన్నట్లు ఉంది. వాస్తవాలను దాచిపెట్టి అంకెల గారడీ చేస్తున్నారు” అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోందని, రైతాంగం తీవ్ర నిరాశలో ఉందని ఆయన హెచ్చరించారు.
ఈ చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం రైతుల పక్షపాతి అని కాంగ్రెస్ నేతలు సమర్థించుకోగా, ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వంపై పోరాటం ఆపేది లేదని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
