Harish Rao: రాష్ట్రంలో ఆశా వర్కర్లు చేస్తున్న పోరాటానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు మద్దతు పలికారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే ఆశా కార్యకర్తలు నెరవేర్చమని అడుగుతున్నారని, వారి డిమాండ్లు ఏమాత్రం గొంతెమ్మ కోరికలు కావని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి డబ్బులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై హరీష్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
హామీలు నెరవేర్చాలని ఆశా వర్కర్ల డిమాండ్
తెలంగాణలో వేలాది మంది ఆశా వర్కర్లు తమ జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం, తమకు నెలకు రూ. 18,000 జీతం ఇవ్వాలని వారు కోరుతున్నారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ హామీలను పట్టించుకోవడం లేదని ఆశా వర్కర్లు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ తీరుపై హరీష్‌రావు విమర్శలు
ఈ అంశంపై స్పందించిన హరీష్‌రావు, ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. “ఏమైనా అంటే పైసలు లేవని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ, కమీషన్లు వచ్చేవాటికే ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. చిన్న ఉద్యోగులకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదు,” అని ఆయన ఆరోపించారు. ఆశా కార్యకర్తల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించాలని, లేకపోతే ఆశాల ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హరీష్‌రావు హెచ్చరించారు.
ఓయూ విద్యార్థులకు అన్యాయం
ఆశా వర్కర్ల సమస్యలతో పాటు, ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో విద్యార్థులను కంచెలు వేసి అడ్డుకుంటున్నారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిన భవనాలను ఈ ప్రభుత్వం రిబ్బన్ కటింగ్ చేసి తమ ఘనతగా చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.