Harish Rao: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొంగులేటి పేల్చుతానన్న బాంబులు అన్నీ తుస్సుమన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. తనపై, బీఆర్ఎస్ పార్టీపై మంత్రి చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కంపెనీ వ్యవహారాలను ప్రస్తావిస్తూ కీలక ప్రశ్నలు సంధించారు.
రాఘవ కన్స్ట్రక్షన్స్లో జరిగిన అవినీతిని అధికారులే గుర్తించారని గతంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశారు. అనుమతులు లేకుండా కంపెనీని నడుపుతున్నారని అధికారులు నోటీసులు ఇచ్చారని, మరి ఇప్పుడు ఆ విషయంపై ముఖ్యమంత్రి చెప్పింది తప్పా లేక మంత్రి పొంగులేటి చెబుతున్నది తప్పా అని నిలదీశారు. నాలుగు శాఖల అధికారులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా, అసెంబ్లీలో తన కంపెనీకి మైనింగ్ అనుమతులు లేవనే నిజాన్ని మంత్రి ఎందుకు దాచారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుడు సమాచారం ఇస్తుంటే మంత్రిగా పొంగులేటి ఎందుకు మౌనంగా ఉన్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. “నువ్వు పొంగులేటివి కాదు.. పొంగులూటివి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ భూమి ప్రభుత్వానిదే అయితే, గత రెండున్నరేళ్లుగా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం పేదల ఇళ్లపైకి మాత్రమే వెళ్తున్న హైడ్రా (HYDRA), అధికార పార్టీ మంత్రికి చెందిన అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
ప్రభుత్వ భూములను కాపాడటంలో హైడ్రా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. పేదల జోలికి వెళ్లేటప్పుడు ఉన్న నిబంధనలు మంత్రుల విషయంలో ఎందుకు వర్తించడం లేదని ఆయన విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపణలన్నీ కేవలం దృష్టి మళ్లించేందుకేనని, వాస్తవాలకు సమాధానం చెప్పలేక కొత్త నాటకాలు ఆడుతున్నారని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
