Harish Rao: తెలంగాణలో నిరుద్యోగుల సమస్య మరోసారి రాజకీయ వేదికపై చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగ బాకీ కార్డును విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
హరీష్‌రావు మాట్లాడుతూ, “సీఎం రేవంత్‌రెడ్డి తన మాట నిలబెట్టుకోవాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు కానీ, అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మారిపోయింది” అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ద్వారా ప్రజలకు మాయ మాటలు చెప్పించారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ కూడా ఇప్పుడు మాయమైందని ఆయన వ్యాఖ్యానించారు.
“ఉద్యోగాల బదులు మద్యం నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారు. జాబులు నింపమంటే జేబులు నింపుకున్నారు” అంటూ హరీష్‌రావు ప్రభుత్వంపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆకాంక్షలను వమ్ము చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హరీష్‌రావు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వేడి పెంచాయి. ఉద్యోగావకాశాలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువత కూడా డిమాండ్ చేస్తున్నారు.

