Harish Rao: తెలంగాణ జల ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి పాలన సాగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షంగా తాము గొంతు ఎత్తే వరకు ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని, ఇప్పుడు అదే ప్రాజెక్టు పేరు మార్చుకుని ‘నల్లమల సాగర్’ రూపంలో తెలంగాణకు ముప్పుగా పరిణమించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాన్ని నిద్రలేపింది మేమే!
గోదావరి-బనకచర్ల అనుసంధానంపై ప్రభుత్వం స్పందించేలా చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని హరీష్ రావు స్పష్టం చేశారు. తాము ఈ అంశాన్ని బయటపెట్టిన తర్వాతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత తేదీలతో లేఖలు రాశారని, కమిటీలు వేస్తున్నట్లు హడావుడి చేశారని విమర్శించారు. కేంద్రం నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రస్తావనే రాలేదని సీఎం రేవంత్ అబద్ధాలు చెబితే, ఏపీ మంత్రి మాత్రం అక్కడ చర్చ జరిగిందని నిజం బయటపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Assam: అసోంలో 11 మంది ఉగ్రవాదుల అరెస్ట్
జల దోపిడీకి కొత్త వ్యూహం
కృష్ణా నదిలో గోదావరి నీళ్లు కలిస్తే బచావత్ అవార్డు నిబంధనల ప్రకారం ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక చిక్కుల వల్లే ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా బనకచర్లను వెనక్కి తీసుకున్నట్లు నటించి, ఇప్పుడు ‘నల్లమల సాగర్’ పేరుతో నీటి దోపిడీకి తెరలేపిందని హరీష్ రావు వివరించారు. బనకచర్ల కంటే నల్లమల సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణకు రెట్టింపు ప్రమాదకరమని (డబుల్ డేంజర్) ఆయన హెచ్చరించారు. ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశాల్లో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి సంతకాలు చేసి వచ్చారని ఆరోపించారు.
చంద్రబాబుకు గురుదక్షిణ?
ఈ వ్యవహారమంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు ‘గురుదక్షిణ’ చెల్లిస్తున్నట్లుగా ఉందని హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. “కత్తి ఏపీదే కావచ్చు.. కానీ దాంతో తెలంగాణ ప్రయోజనాలను పొడిచేది మాత్రం మన ముఖ్యమంత్రే” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలు తమ నీటి వాటాల కోసం అప్రమత్తంగా ఉంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కళ్లు మూసుకుని కూర్చుందని మండిపడ్డారు. నల్లమల సాగర్ నిర్మాణానికి చంద్రబాబు సూత్రధారి అయితే, రేవంత్ రెడ్డి పాత్రధారిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
