Phone Tapping Case

Phone Tapping Case: సిట్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు.. ఏం జరగబోతోంది?

Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ కోసం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుకు ప్రత్యేక విచారణ బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. ఈరోజు (మంగళవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు. ఇందుకోసం సిట్ అధికారులు ఇప్పటికే ఒక ప్రత్యేక ప్రశ్నల జాబితాను సిద్ధం చేసుకున్నారు.

సిద్దిపేటలో హరీష్‌రావుకు వ్యతిరేకంగా పోటీ చేసిన చక్రధర్ గౌడ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో చక్రధర్ గౌడ్‌తో పాటు పలువురు రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినట్లు హరీష్‌రావుపై ఆరోపణలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Gurugram: డెలివరీ బాయ్‌ను కారుతో ఢీకొట్టిన డాక్టర్ అరెస్ట్

ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన మాజీ పోలీస్ అధికారులు ఇచ్చిన సమాచారం, అలాగే ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్ రావుతో ఉన్న సంబంధాల ఆధారంగా సిట్ అధికారులు హరీష్‌రావును ప్రశ్నించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 618 ఫోన్ నంబర్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారనేది ఈ కేసులో ప్రధాన అంశం.

మరోవైపు, ఈ నోటీసులపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే హరీష్‌రావును వేధిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విచారణకు వెళ్లే ముందు హరీష్ రావు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మరియు ఇతర ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అక్కడి నుంచే భారీ అనుచరగణంతో కలిసి ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ విచారణలో హరీష్ రావు ఇచ్చే సమాధానాలు ఈ కేసులో తదుపరి చర్యలకు అత్యంత కీలకం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *