Harish Rao: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల బనకచర్ల ప్రాజెక్టుపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఏపీ సర్కారుతో కుమ్మక్కై తెలంగాణ నీటి హక్కులకు సీఎం రేవంత్‌రెడ్డియే విఘాతం కల్పిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నవారి గురించి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు.
Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్‌లో ఇచ్చినట్టు లేదని, అమరావతిలో కూర్చొని ఇచ్చినట్టున్నదని హరీశ్‌రావు విమర్శించారు. అసలు దానిని ఏపీ సీఎం చంద్రబాబే తయారు చేసి ఇచ్చినట్టు ఉన్నదని ఆరోపించారు. ఆ ప్రజెంటేషన్‌లో అసలు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఎందుకు వివరించలేదని నిలదీశారు.
Harish Rao: మీరే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకున్నవారైతే, కేంద్ర ప్రభుత్వానికి మీరిచ్చిన లేఖలు చూపించండి.. అని సీఎం రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన లేఖలను చూపడమేమిటి? అని అడిగారు. సీఎం రేవంత్‌రెడ్డికి అసలు బనకర్లను కట్టే చంద్రబాబు బంగారు బాబుగా కనిపిస్తున్నాడు అని, బీఆర్ఎస్ మాత్రం సచ్చిన పాము లెక్క కనిపిస్తున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సచ్చిన పామే అయితే నిత్యం బీఆర్ఎస్, కేసీఆర్ జపం ఎందుకు చేస్తున్నావు రేవంత్ అని ప్రశ్నించారు.
Harish Rao: రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాతే బనకచర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని హరీశ్‌రావు ఆరోపించారు. అసలు 2024 జూలై 6న ప్రగతిభవన్‌లో రేవంత్‌రెడ్డి, చంద్రబాబును కలిసిన తర్వాతే తెలంగాణ నీటి హక్కులకు మరణశాసనం రాసిండని విమర్శించారు. 2024 సెప్టెంబర్ 13న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీసమేతంగా విజయవాడలో చంద్రబాబు ఇంటికి వెళ్లి బజ్జీలు తిని వచ్చారని ఆరోపించారు. నవంబర్ నెలలోనే చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారని తెలిపారు.
Harish Rao: సచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు కాదు.. మీ అధినేత రాహుల్‌గాంధీకి చెప్పుకో రేవంత్‌రెడ్డీ.. అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నువు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నీ అధ్యక్షతన ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు.. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ సచ్చిన పాము అయిందా? అని ప్రశ్నించారు.
Harish Rao: ముఖ్యమంత్రి అయిన తర్వాతే మీ సొంత జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచిన విషయాన్ని రేవంత్‌రెడ్డి మరువొద్దు.. అని హరీశ్‌రావు గుర్తుచేశారు. అహంకారంతో మాట్లాడితే ప్రజలు అథఃపాతాళానికి తొక్కుతారని హెచ్చరించారు. చౌకబారు మాటలను విడనాడాలని హితవు పలికారు.