Harish Rao

Harish Rao: కార్మికులపై ప్రభుత్వం కక్ష కట్టింది

Harish Rao: తెలంగాణలో డిపెండెంట్ ఉద్యోగుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కార్మికులను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే కార్మికులపై కక్ష కట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని, మొత్తం ఉద్యోగుల్లో సగం మంది ఉన్న డిపెండెంట్ ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

సింగరేణి సంస్థకు చెందిన నిధులను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధం లేని మెస్సీ టూర్ వంటి కార్యక్రమాల కోసం సింగరేణి నిధులు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చాక ఈ నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, తప్పు చేసిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. సింగరేణిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని, తక్షణమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

జర్నలిస్టుల విషయంలో కూడా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ.. వారికి నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 26 వేల అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చి, జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్ల నిధిని కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్డుల సంఖ్యను 10 వేలకు తగ్గించే ప్రయత్నం చేస్తోందని, డెస్క్‌లో పనిచేసే వారికి కార్డులు ఇవ్వమని చెప్పడం సరికాదని హరీశ్‌రావు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *