Harish Rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఉల్లంఘన జరుగుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోందని హరీశ్ రావు ప్రశ్నించారు. శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు, రోడ్లు గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడవా? అని ఆయన నిలదీశారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం వెంటనే సమీక్ష చేసి, ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
విద్యుత్ శాఖ పనితీరుపై కూడా హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ శాఖను మొత్తం ఆంధ్రప్రదేశ్ అధికారులతో నింపుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమైన బాధ్యతల్లో ఆంధ్ర అధికారులను నియమిస్తున్నారని చెబుతూ, ప్రభుత్వాన్ని తెలంగాణ వారు నడుపుతున్నారా? లేక వెనుక ఉండి ఏపీ వారు నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. ఏపీ అధికారులు, అవినీతి కారణంగా రాష్ట్ర విద్యుత్ రంగం అస్తవ్యస్తమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణంపైనా హరీశ్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. తక్కువ ధరకే ఎన్టీపీసీ సంస్థ విద్యుత్ ఇస్తుంటే, మళ్లీ కొత్త ప్లాంట్లు ఎందుకని నిలదీశారు. కమీషన్ల కోసమే కొత్త పవర్ ప్లాంట్లు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో చర్చకు సిద్ధమని, ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని హరీశ్ రావు సవాల్ విసిరారు. కొత్తగా చేపట్టబోయే మూడు ప్లాంట్లకు దాదాపు రూ. 45 వేల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ఎన్టీపీసీ విద్యుత్ ఇస్తుంటే, ఇన్ని వేల కోట్లు ఎందుకు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

