Harish Rao: తెలంగాణ అసెంబ్లీ వేదికగా మూసీ నది పునరుజ్జీవం మరియు సుందరీకరణ ప్రాజెక్టుపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మూడు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం చెబుతున్న భారీ అంకెలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు లక్ష కోట్లా లేక లక్షన్నర కోట్లా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని, దీనిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు సంక్షేమ పథకాలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం, ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడి నుండి సమీకరిస్తుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
కేవలం నిధుల అంచనాలే కాకుండా, ప్రాజెక్టు డిజైన్ మరియు అమలు తీరుపై కూడా హరీష్ రావు కీలక ప్రశ్నలు సంధించారు. మూసీలోకి గోదావరి జలాలను తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో, ఆ నీటిని ఎక్కడి నుండి మళ్లిస్తారో స్పష్టం చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుండి నీళ్లు తెస్తారా లేక మరో ప్రత్యామ్నాయం ఉందా అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Telangana: న్యూ ఇయర్ సంబరాలతో తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డు
గత ప్రభుత్వం మూసీ కాలుష్యాన్ని నివారించేందుకు 32 ఎస్టీపీలను (STPs) ఏర్పాటు చేసిందని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుతం అవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వికారాబాద్ మురికి నీరు గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల్లోకి చేరుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకాంశం ‘నిర్వాసితుల సమస్య’ అని హరీష్ రావు ఉద్ఘాటించారు. మూసీ సుందరీకరణ ముసుగులో పేదల ఇళ్లను కూల్చివేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం సరైన పరిహారం అందుతుందా లేదా అని ప్రశ్నించారు. “పేదల ఇళ్లు కూల్చాలని చూస్తే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం” అంటూ గతంలో తాము ఇచ్చిన పిలుపును సభలో పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో సామాన్యుల జీవితాలతో ఆటలాడకూడదని, ప్రతి అడుగు పారదర్శకంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ కొనసాగుతోంది.
