Harish Rao: బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లోకి వెళ్లిందని వ్యాఖ్యానించారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రి రాత్రి 9:30 గంటలకు చిట్‌చాట్ పేరుతో వివరణ ఇచ్చుకోవడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. అరడజను మంది మంత్రులు పోటీ పడి ప్రెస్‌మీట్లు పెట్టడం కేసీఆర్ ప్రభావానికి నిదర్శనమని అన్నారు.
అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోలు, గ్లోబల్ సమ్మిట్‌లు పేదవాడికి అన్నం పెడతాయా? అని హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి సచివాలయం అంటేనే భయం పట్టుకుందని విమర్శించారు. వాస్తు భయంతో సెక్రటేరియట్ మెట్లు కూడా ఎక్కడం లేదని ఎద్దేవా చేశారు. గేట్లు, తలుపులు మార్చినా భయం పోక కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు.
స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మందికి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవడంతో సీఎం రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావడం లేదని విమర్శించారు. అందుకే కో-ఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా, కాంగ్రెస్ కార్యకర్తలను నామినేషన్ల ద్వారా నియమించాలని చూస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే కో-ఆపరేటివ్ ఎన్నికలు నిర్వహించాలని హరీష్ రావు సవాల్ విసిరారు.
ఓయూకు ఒంటరిగా వస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, వేలాది మంది పోలీసుల పహారాలో వెళ్లారని అన్నారు. విద్యార్థి నాయకులను ముందుగా అరెస్టు చేయించి వెళ్లడం సీఎం పిరికితనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
సాగునీటిపై ప్రభుత్వం ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను స్వాగతిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. అయితే వాస్తవాలు చెప్పేందుకు బీఆర్ఎస్‌కు కూడా PPT ఇచ్చే అవకాశం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో సీపీఐ, ఎంఐఎం, బీజేపీలకంటే తమకు తక్కువ సమయం ఇస్తూ గొంతు నొక్కుతున్నారని, మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ బండారాన్ని బయటపెడతామని అన్నారు.
ఇది ప్రభుత్వం కాదని, ఒక కన్సల్టెన్సీ కంపెనీలా పనిచేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. బొంబాయి బ్రోకర్ల సలహాలతో ఈ సర్కార్ నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
