Harish Rao: బొగ్గు గురించి రోజుకో నిజం వస్తుంది..

Harish Rao: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసువ్యవహారం రాజకీయ వేడిని పెంచుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నోటీసులు జారీ కావడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.

హరీశ్ రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ నోటీసులను రాజకీయ కక్ష సాధింపు కోసం ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, దోపిడీ అంశాలను ఆధారాలతో బయటపెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌ను కలవబోతున్న సమయంలోనే, ప్రజల దృష్టిని మరల్చేందుకే హడావుడిగా సంతోష్ కుమార్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.

తాను గతంలో బొగ్గు కుంభకోణం (సింగరేణి స్కాం) అంశాన్ని బయటపెట్టినప్పుడు తనకూ నోటీసులు వచ్చాయని, అదే అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించినప్పుడు ఆయనకూ సిట్ నోటీసులు పంపారని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం కేవలం రాజకీయ కక్ష సాధింపేనని ఆయన అన్నారు.

ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, బొగ్గు కుంభకోణం వెనుక ఉన్న నిజాలు బయటకు వస్తూనే ఉన్నాయని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *