Harish Rao: రేషన్ డీలర్ల సమస్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం రేషన్ డీలర్లు ఆయనను కలిసి తమ గోడును వెల్లడించగా, ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడ్డారు.
హరీశ్ రావు మాట్లాడుతూ, “నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం” అని అన్నారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చే డీలర్లు కమీషన్ అందక ఇబ్బందులు పడుతున్నా, కాంగ్రెస్–బీజేపీ ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయన్నారు.
అభయహస్తం పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్ పెంపు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆ హామీలు నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో నమ్మించి, ఇప్పుడు నట్టేట ముంచేశారు. మాటలు తప్ప చేతలు లేని కోతల ప్రభుత్వం ఇది” అంటూ మండిపడ్డారు.
తాను మంత్రి హోదాలో ఉన్నప్పుడు రేషన్ డీలర్ల సమస్యలను సచివాలయానికి ఆహ్వానించి ప్రత్యక్షంగా విని పరిష్కరించామని హరీశ్ రావు గుర్తుచేశారు. మెట్రిక్ టన్నుకు ఇచ్చే కమీషన్‌ను రూ. 900 నుంచి రూ. 1400కు పెంచామని, దీంతో ప్రభుత్వంపై రూ. 139 కోట్ల అదనపు భారం పడినా రేషన్ డీలర్ల సంతోషం కోసం కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.