Hanamkonda: హన్మకొండ జిల్లాలో ఓ తండ్రి చేసిన నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొడుకు తనను పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో మాజీ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి రూ. 3 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించారు.
ఎల్కతుర్తికి చెందిన శ్యాంసుందర్ రెడ్డి, వసంత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడగా, కుమారుడు రంజిత్ కూడా అమెరికాలో ఉద్యోగం చేసి 2016లో స్వదేశానికి వచ్చాడు. ప్రస్తుతం రంజిత్ హన్మకొండలో తన భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.
శ్యాంసుందర్ రెడ్డి తెలిపిన ప్రకారం, తన భార్య వసంత నాలుగేళ్ల క్రితం మృతి చెందిన తర్వాత కుమారుడు తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, తనకు తెలియకుండానే కుమారుడు మొత్తం ఆస్తిని తన పేరునకు మార్చుకున్నాడని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తాను తన పేరున ఉన్న మూడెకరాల భూమిని ప్రభుత్వానికి దానం చేసినట్లు ఆయన వెల్లడించారు. తల్లిదండ్రులను చూసుకోని వారికీ ఆస్తిపై హక్కు లేదన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నానని శ్యాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. తన భార్య జ్ఞాపకార్థం ఆ భూమిపై ప్రజల కోసం భవనాలు నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.