Khairatabad Ganesh Shobhayatra: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని వివిధ మండపాల నుంచి బొజ్జ గణపయ్యలు శోభాయాత్రలతో ట్యాంక్‌బండ్ వైపు తరలివస్తున్నాయి. భక్తుల ఉత్సాహం, నగర వీధుల్లో గణనాథుని నామస్మరణలతో వాతావరణం పండుగ వాతావరణంగా మారిపోయింది.
ఈ నిమజ్జనంలో ప్రధాన ఆకర్షణ 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన ఖైరతాబాద్ బడా గణేష్. ఆయన శోభాయాత్ర కాసేపట్లో ప్రారంభంకానుండటంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి.
ఖైరతాబాద్ గణపతి మండపం వద్ద భక్తులు అర్ధరాత్రి నుంచే పెద్ద ఎత్తున తరలివస్తూ గణనాథుని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా రోప్ పార్టీతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. గణనాథుడి రెండు వైపులా దేవతామూర్తుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కుడివైపున పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపురసుందరి విగ్రహాలు, ఎడమ వైపున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
నగరంలో నిన్న రాత్రి నుంచే నిమజ్జన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ట్యాంక్‌బండ్ వద్ద భారీ వెల్డింగ్ పనులు, ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు పూర్తి చేశారు అధికారులు. శోభాయాత్రలతో నగరమంతా పండుగ వాతావరణంలో తేలిపోతోంది.