Hair Dryer Blast: కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఇల్కల్ నగరంలో హెయిర్ డ్రయ్యర్ పేలి ఒక మహిళ రెండు చేతులను కోల్పోయింది. ప్రస్తుతం మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ మహిళ స్నేహితురాలు హెయిర్ డ్రైయర్‌ని ఆర్డర్ చేసింది. అయితే, దానిని డెలివరీ తీసుకునే సమయంలో ఆమె కనిపించలేదు. దీంతో బాధితురాలు ఆ కొరియర్ డెలివరీ తీసుకుంది. ఆ తరువాత హెయిర్ డ్రయ్యర్ స్విచ్ ఆన్ చేసింది. స్విచ్ ఆన్ చేసిన వెంటనే అది పేలి మహిళ రెండు చేతులు తీవ్రంగా కాలిపోయాయి. వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. పేలుడు ధాటికి దెబ్బతిన్న ఆమె రెండు చేతులను తొలగించాల్సి వచ్చింది.
Hair Dryer Blast: ఆ మహిళ పేరు బసమ్మ. ఆమె బాగల్‌కోట్ జిల్లా ఇల్కల్ పట్టణంలో నివసిస్తోంది. ఆ మహిళ భర్త పేరు పాపన్న. అతను సైన్యంలో ఉండేవాడు. బసమ్మ భర్త పాపన్న 2017లో జమ్మూకశ్మీర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో చనిపోయాడు. తన ఇంటిపక్కనే ఉండే శశికళ అనే మహిళతో బసమ్మకు మంచి స్నేహం ఉందని స్థానికులు చెబుతున్నారు. శశికళ ఏదో పని నిమిత్తం ఊరు వెళ్ళింది. ఇంతలో కొరియర్ నుండి ఒక పార్శిల్ వచ్చింది.
Hair Dryer Blast: పార్శిల్‌పై ఉన్న శశికళ మొబైల్ నంబర్‌ను చూసి కొరియర్ కంపెనీ ఉద్యోగి శశికళకు ఫోన్ చేసి ఆమె పేరు మీద పార్శిల్ వచ్చిందని చెప్పాడు. దానికి ఆమె తాను వేరే ఊరిలో ఉన్నానని, తిరిగి వచ్చాక తీసుకుంటానని చెప్పింది. కానీ, ఆ కొరియర్ బాయ్ పదే పదే ఫోన్ చేసి కొరియర్ తీసుకోవాలని విసిగించాడు. దీంతో ఆమె తన స్నేహితురాలు బసమ్మకు కొరియర్ తీసుకోవాలని చెప్పింది. దానిని తీసుకోవడంతో ఈ దారుణం జరిగింది.
Hair Dryer Blast: కొరియర్ నుంచి వచ్చిన పార్శిల్ తెరిచి చూసేసరికి లోపల హెయిర్ డ్రయ్యర్ ఉందని బసమ్మ చెప్పింది. అదే సమయంలో అక్కడ ఉన్న మరో ఇరుగుపొరుగు దాన్ని ఆన్ చేసి చూపించమని అడిగారు. దీంతో ఆమె హెయిర్ డ్రైయర్ స్విచ్ ఆన్ చేయగా అది పేలిపోయింది. పేలుడు ధాటికి ఆమె చేయి విరిగి, వేళ్లు తెగిపోయాయి. ఇరుగుపొరుగు వాళ్ళు హడావుడిగా బాధితురాలిని ఇల్కల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడంతో వైద్యులు ఆపరేషన్ సమయంలో రెండు చేతులు తీసివేయాల్సి వచ్చింది.
పలు అనుమానాలు..
Hair Dryer Blast: అదే సమయంలో ఈ విషయం తెలుసుకున్న శశికళ కూడా హడావుడిగా ఆసుపత్రికి చేరుకుని బసమ్మ పరిస్థితిని తెలుసుకుంది. అయితే ఆసుపత్రిలో శశికళ చెప్పిన విషయాలు మరింత ఆశ్చర్యం కలిగించాయి. నిజానికి శశికళ హెయిర్ డ్రయ్యర్ ఆర్డర్ చేయలేదు. అయితే ఆమె పేరు మీద హెయిర్ డ్రైయర్ పార్శిల్ ఎలా వచ్చింది అనేది అర్ధం కావడం లేదు. అసలు ఈ పార్సిల్ కోసం డబ్బులు ఎవరు ఇచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన ఓ కంపెనీలో హెయిర్ డ్రయ్యర్‌ను తయారు చేసినట్లు వెల్లడైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పేలుడు పలు అనుమానాలకు తావిస్తోంది.