H-1B Visa

H-1B Visa: వీసాపై కొత్త నిబంధన గందరగోళంపై వైట్‌హౌస్‌ క్లారిటీ!

H-1B Visa: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ నిపుణులకు H-1B వీసా నిబంధనలపై స్పష్టత లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచారని వార్తలు వచ్చిన తర్వాత నెలకొన్న గందరగోళంపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వివరణ ఇచ్చారు.

H-1B వీసాపై కొత్త నిబంధన: గందరగోళంపై స్పష్టత
అమెరికాలో పనిచేయడానికి విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్‌-1బీ వీసా రుసుము లక్ష డాలర్లకు పెరిగిందనే వార్త మొదట ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యంగా ఏటా లాటరీలో వీసాలు పొందే భారతీయ టెక్‌ నిపుణులు ఈ నిర్ణయంతో ఆందోళన చెందారు. అయితే, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్, ‘ఎక్స్’ వేదికగా దీనిపై వివరణ ఇచ్చారు. ఈ లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని, కేవలం ఒకసారి చెల్లించాల్సిన వన్‌టైమ్‌ ఫీజు మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.

ఎవరికి వర్తిస్తుంది?
ఈ కొత్త నిబంధన కేవలం కొత్తగా H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుందని లీవిట్ తెలిపారు.

ఇప్పటికే H-1B వీసా ఉన్నవారికి: వీసా ఉండి ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్నవారు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు ఎప్పటిలాగే అమెరికాకు వెళ్లి తిరిగి రావొచ్చు. వారిపై ఈ కొత్త ఫీజు విధించబడదు.

వీసా రెన్యూవల్ చేసేవారికి: ప్రస్తుత వీసాను రెన్యూవల్ చేసుకునే వారికి కూడా ఈ నిబంధన వర్తించదు.

ఈ ఏడాది లాటరీలో పాల్గొన్నవారికి: 2025 లాటరీలో పాల్గొన్న వారికి కూడా ఈ నియమం వర్తించదు. ఈ నిబంధనలు భవిష్యత్తులో దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తాయి.

అమెరికాలోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ గందరగోళం నేపథ్యంలో సహాయం కోరే భారతీయ పౌరుల కోసం అత్యవసర నంబర్‌ను (1-202-550-9931) విడుదల చేసింది.

Also Read: Caps Gold: క్యాప్స్‌ గోల్డ్‌లో ఐదో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు..

భారత ప్రభుత్వం, కంపెనీల స్పందన: 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై భారత ప్రభుత్వం, టెక్‌ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఈ నిర్ణయం తమ విదేశీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి అమెరికన్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. ఈ నిర్ణయం ఇండో-అమెరికన్ సంబంధాల చారిత్రక సందర్భానికి ఆమోదయోగ్యం కాదని, దీనిపై భారత ప్రభుత్వం వెంటనే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

H-1B వీసా అనేది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కంప్యూటర్ నిపుణులు, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ కార్మికులను అమెరికాలో పనిచేయడానికి అనుమతించే వీసా. మొదట మూడు సంవత్సరాలకు ఇచ్చే ఈ వీసాను ఇప్పుడు ఆరు సంవత్సరాల వరకు పొడిగించారు. ఏటా కేటాయించే ఈ వీసాల్లో దాదాపు మూడొంతుల మంది భారతీయ నిపుణులే ఉండటం గమనార్హం. ఈ నిబంధన చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ, కార్యనిర్వాహక ఉత్తర్వులు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *