Telangana: వికారాబాద్ జిల్లా పరిధిలోని తుంకుల్‌గడ్డలో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో విద్యార్థినులు రోడ్డెక్కారు. గత రెండు నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ, సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోవడంతో వారు ఈ నిరసన చేపట్టారు.
యాజమాన్యంపై విద్యార్థినుల ఆగ్రహం
ఫ్యాకల్టీ లేకపోవడం గురించి అడిగితే, కళాశాల యాజమాన్యం డిజిటల్ క్లాసులు వినమని చెప్పిందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ క్లాసులు వింటున్నప్పుడు సందేహాలు వస్తే వాటిని ఎవరు నివృత్తి చేస్తారని వారు ప్రశ్నించారు. ఈ పరిస్థితి వల్ల తాము చదువులో వెనుకబడిపోతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులు వచ్చే వరకు తరగతి గదుల్లోకి వెళ్లబోమని విద్యార్థినులు తేల్చి చెప్పారు. తమ సమస్యను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ తమ నిరసనను పట్టించుకోకపోతే, హైవేపై బైఠాయించి ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ఘటనతో కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.