GST: ఆదాయ ఆర్జనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో సఫలమైంది. ముఖ్యంగా 2025 సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లలో జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు చేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి నిదర్శనంగా నిలిచింది. అదే తెలంగాణ రాష్ట్రం మాత్రం నేలచూపులు చూస్తున్నది. 2025 సెప్టెంబర్ జీఎస్టీ వసూళ్లలో -5 శాతంగా నమోదై అట్టడుగున నిలిచింది.
GST: ఈ ఏడాది కూడా రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్ల లెక్కలను అంకెల వారీగా కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో సగటున 7 శాతం వృద్ధిరేటును సాధించాయి. సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నికర జీఎస్టీ రూపంలో రూ.2,789 కోట్ల ఆదాయం సమకూరింది. స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3,653 కోట్లుగా నమోదయ్యాయి. 2024 సెప్టెంబర్ నెలతో పోల్చితే నికర రాబడి 7.45 శాతం పెరిగింది. అంటే జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటును ఏపీ సాధించిందన్నమాట.
GST: రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూపంలో రూ.1,185 కోట్లు, ఐజీఎస్టీ సర్దుబాటు ద్వారా మరో రూ.1,605 కోట్లు ఏపీ రాష్ట్ర ఖజానాకు చేరాయి. రాష్ట్రంలో వస్తు వినియోగం పెరగడంతోపాటు పన్నుల సేకరణలో అధికారులు కఠినంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. పాలకుల సమర్థ నిర్ణయాలు కూడా దోహదం చేసినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
GST: తెలంగాణ రాష్ట్రం మాత్రం -5 వృద్ధిరేటును సాధించి వెనుకబడింది. నిరుటి కంటే రూ.267 కోట్లు తగ్గడం, జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే తెలంగాణ చివరి స్థానంలో నిలవడం గమనార్హం. గత ఏడాది రూ.5,267 కోట్లు వసూలు కాగా, ఏడాది 4,993 కోట్లుగా నమోదైంది. 2021 నుంచి తెలంగాణ రెండంకెల వృద్ధిరేటును సాధిస్తూ రాగా, ఈసారి మైనస్ వృద్ధిరేటు నమోదు కావడం కొంత నిరాశాజనకంగా చెప్పుకోవచ్చు. 2020 కరోనా కాలంలోనే కొంత తగ్గిపోయింది. ఆ తర్వాత పుంజుకోగా, ఈ ఏడాది మాత్రమే మళ్లీ మైనస్ వృద్ధిరేటు నమోదైంది.