CM Chandrababu

CM Chandrababu: ఏపీ భవిష్యత్తును మార్చే గేమ్ ఛేంజర్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ‘గ్రీన్ ఎనర్జీ హబ్’గా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం ఒక భారీ అడుగు వేసింది. కాకినాడలో సుమారు రూ. 18,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చబోయే ‘గేమ్ ఛేంజర్’ అని అభివర్ణించారు. 2027 జూన్ నాటికి ఈ పరిశ్రమలో మొదటి దశ ఉత్పత్తి ప్రారంభం కానుందని, ఇక్కడి నుండి విదేశాలకు గ్రీన్ అమ్మోనియా సరఫరా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

సంప్రదాయం, టెక్నాలజీల కలయికే అభివృద్ధి సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు, జల్లికట్టు పోటీలతో గ్రామాల్లో నెలకొన్న ఉత్సాహాన్ని గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబు భావోద్వేగంగా మాట్లాడారు. “మనం ఎక్కడ ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా మన జన్మభూమిని, స్వగ్రామాన్ని మర్చిపోకూడదు” అని ఆయన పిలుపునిచ్చారు. సంప్రదాయాలను కాపాడుకుంటూనే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని, పర్యావరణానికి హాని కలిగించే బొగ్గు వినియోగాన్ని తగ్గించి క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు.

Also Read: Cp sajjanar: లక్కీ డ్రా అంటే కేసులు పెడతాం.. మాస్ వార్నింగ్ ఇచ్చిన సజ్జనర్

స్వర్ణాంధ్ర దిశగా అడుగులు: డ్రోన్ అంబులెన్సులు, స్పేస్ సిటీ రాష్ట్ర భవిష్యత్తుపై తన విజన్‌ను వివరిస్తూ, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ‘స్వర్ణాంధ్ర’గా మారుస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఇంధన రంగమే కాకుండా, అమరావతిని దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ చిరునామాగా మారుస్తామని ప్రకటించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు 2026 నాటికి డ్రోన్ అంబులెన్సులను అందుబాటులోకి తెస్తామని, అలాగే కాకినాడ హోప్ ఐలాండ్‌ను కేంద్రంగా చేసుకుని స్పేస్ సిటీ మరియు శాటిలైట్ సిటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రోడ్లపై రద్దీ తగ్గించేందుకు భవిష్యత్తులో డ్రోన్ ట్యాక్సీల వంటి ఆధునిక రవాణా వ్యవస్థలను కూడా ప్రోత్సహిస్తామన్నారు.

రైతన్నలకు మేలు.. పారిశ్రామికవేత్తలకు భరోసా గ్రీన్ అమ్మోనియా వల్ల కేవలం పారిశ్రామిక రంగమే కాకుండా వ్యవసాయ రంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ప్రకృతి సేద్యం పెరగాలని, రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఏఎం గ్రీన్ సంస్థ అధినేత అనిల్‌ను ప్రశంసిస్తూ, ఆలోచనలను ఆచరణలో పెట్టే ఇలాంటి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇప్పటికే రూ. 8.75 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *