Governor Grandson

Governor Grandson: వర్నర్ మనవడిపై వరకట్న వేధింపులు.. హత్యాయత్నం ఆరోపణలు!

Governor Grandson: కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కుటుంబం సంచలన వివాదంలో చిక్కుకుంది. ఆయన మనవడు దేవేంద్ర గెహ్లాట్‌పై ఆయన భార్య దివ్య గెహ్లాట్ తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, హత్యాయత్నానికి పాల్పడ్డాడని, మైనర్ కుమార్తెను అపహరించారని దివ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

పెళ్లయిన నాటి నుంచే నరకం..

2018 ఏప్రిల్ 29న ముఖ్యమంత్రి కన్యాదాన యోజన కింద మధ్యప్రదేశ్‌లోని అలోట్‌లో దేవేంద్ర గెహ్లాట్, దివ్య గెహ్లాట్‌ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అప్పటి కేంద్ర మంత్రి సుమిత్రా మహాజన్, ప్రస్తుత గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వంటి పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. అయితే, అత్తారింట్లో అడుగుపెట్టిన నాటి నుంచే తన జీవితం నరకమైందని దివ్య వాపోతున్నారు.

రూ. 50 లక్షల కట్నం డిమాండ్, అక్రమ సంబంధాలు

దివ్య ఫిర్యాదు ప్రకారం… భర్త దేవేంద్ర గెహ్లాట్, మామ జితేంద్ర గెహ్లాట్ (అలోట్ మాజీ ఎమ్మెల్యే), బావమరిది విశాల్ గెహ్లాట్ సహా నలుగురు కుటుంబ సభ్యులు తనను సంవత్సరాలుగా వేధిస్తున్నారు. అదనంగా రూ. 50 లక్షలు కట్నం తీసుకురావాలని నిత్యం డిమాండ్ చేసేవారు. అంతేకాకుండా, దేవేంద్ర గెహ్లాట్ ఇప్పటికే మద్యానికి, మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని, ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని దివ్య ఆరోపించారు.

గర్భధారణలోనూ వేధింపులు.. హత్యాయత్నం

  • గర్భధారణ సమయంలో: 2021లో తాను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా వేధింపులు మరింత ఎక్కువయ్యాయని, సరిగా ఆహారం పెట్టేవారు కాదని, తనను కొట్టేవారని, మానసికంగా హింసించేవారని దివ్య పేర్కొన్నారు.

  • హత్యాయత్నం ఆరోపణ: జనవరి 26న భర్త తాగి ఇంటికి వచ్చాక దారుణంగా దాడి చేసి డబ్బు తేకపోతే చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో వివరించారు. ఈ క్రమంలోనే ఇంటి పైకప్పు నుంచి తనను తోసివేశాడని, గ్యాలరీలో పడిపోవడంతో తన వెన్నెముక, భుజం, నడుముకు తీవ్ర గాయాలయ్యాయని దివ్య తెలిపారు. ఆ రాత్రంతా తనకు వైద్యం అందించకుండా వదిలేశారని ఆరోపించారు. మరుసటి రోజు ఉదయం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినా, తన తల్లిదండ్రులకు మాత్రం సమాచారం ఇవ్వకుండా, వైద్య ఖర్చులు భరించాలని మాత్రం తన తండ్రిపై ఒత్తిడి తెచ్చారని వాపోయారు.

కుమార్తె అపహరణ, పోలీసులకు ఫిర్యాదు

ప్రస్తుతం తన నాలుగేళ్ల కుమార్తెను అత్తమామలు బలవంతంగా ఉజ్జయిని జిల్లాలోని నాగ్డాలో ఉంచారని, బిడ్డను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని దివ్య ఆరోపించారు. డబ్బు తీసుకురాకపోతే కూతుర్ని కలిసేది లేదని భర్త బెదిరించినట్లు తెలిపారు.

దీంతో దివ్య గెహ్లాట్ ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్‌లోని రత్లాం పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ కుమార్ గారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. వరకట్న వేధింపులు, హత్యాయత్నం, గృహ హింస, మైనర్ కుమార్తెను అపహరించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని, తనకు భద్రత కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

మాజీ ఎమ్మెల్యే స్పందన

ఈ ఆరోపణలపై మామ, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గెహ్లాట్ స్పందిస్తూ.. “ఎవరైనా ఆరోపణలు చేయవచ్చు. నేను అన్ని వాస్తవాలను మీడియా ముందు పెడతాను.” అని అన్నారు.

దివ్య ప్రస్తుతం రత్లాంలో తన తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *