Aadi Srinivas: ఎమ్మెల్సీ కవిత రాజీనామా వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. కవిత వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అంగీకరించినట్లే ఉన్నాయని ఆయన అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్నది నిజమని తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు.
“కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత స్వయంగా ఒప్పుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలను ఆమె మాటలు రుజువు చేస్తున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెబుతున్నవి అన్నీ నిజమని ఇప్పుడు స్పష్టమైంది” అని ఆదిశ్రీనివాస్ అన్నారు.
బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన అక్రమాలను బయటపెట్టింది కూడా రేవంత్ రెడ్డి గారేనని ఆయన గుర్తు చేశారు. “రేవంత్ రెడ్డి ఎవరి వెనుక ఉండరు. ఆయన ఎప్పుడూ నిజం వైపే నిలబడతారు. అందుకే ఆయన వెనుక అందరూ ఉంటారు. తెలంగాణ ప్రజలు కూడా ఆయన నాయకత్వాన్ని పూర్తిగా నమ్ముతున్నారు” అని ఆదిశ్రీనివాస్ తెలిపారు.
ప్రజల నమ్మకాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై ఎటువంటి రాజీ లేకుండా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలను బయటపెడతామని, దోషులను శిక్షిస్తామని ఆదిశ్రీనివాస్ హెచ్చరించారు. ఈ పోరాటంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.