Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని మరింత పారదర్శకంగా, ప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ (MoRTH) ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపుతో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు చాలామంది సరైన శిక్షణ లేకుండానే లైసెన్స్‌లు పొందుతుండటంతో పాటు, నగరాల్లో ఉన్న డ్రైవింగ్ స్కూల్స్‌లో ట్రాక్‌లు, ప్రాక్టీస్ వసతులు లేకపోవడం వల్ల శిక్షణ కేవలం పేరుకే పరిమితమైపోయింది. ఈ లోపాలను దృష్టిలో ఉంచుకొని, డ్రైవింగ్ నేర్చుకునే వారికి నిబంధనలు, రోడ్డు భద్రత, నియమాలు బోధించే విధంగా కొత్త శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతి పది లక్షల జనాభాకు ఒక కేంద్రం చొప్పున మొత్తం 53 డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను (DTCలు) ఏర్పాటు చేయడానికి మోర్త్ ఆమోదం తెలిపింది. అదనంగా, ఐదు ప్రాంతీయ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను (RDTCలు) కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఉత్తరాంధ్రలో ఒకటి, కోస్తాంధ్రలో మూడు, రాయలసీమలో ఒకటి చొప్పున ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ప్రతి ఆర్‌డీటీసీకి కనీసం మూడు ఎకరాల భూమి అవసరం. ఒక్కో కేంద్రం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్ల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ సెంటర్లలో ఆధునిక ట్రాక్‌లు, సిమ్యులేటర్లు ఏర్పాటు చేయబడతాయి. ఇక్కడ శిక్షణ పూర్తిచేసుకున్న వారు నేరుగా ఆ సెంటర్ నుంచే డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకొని, పరీక్ష లేకుండానే లైసెన్స్ పొందే అవకాశం ఉంటుంది.
డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు (DTCలు) ఏర్పాటుకు కనీసం రెండు ఎకరాల స్థలం అవసరం. ఒక్కో కేంద్రం ఏర్పాటు ఖర్చులో 85 శాతం వరకు లేదా గరిష్ఠంగా రూ.2.5 కోట్ల వరకు మోర్త్ నిధులు అందిస్తుంది. ఈ కేంద్రాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలు నడపడం వంటి శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రాథమిక అవగాహన తరగతులతో పాటు సిమ్యులేటర్ ద్వారా ప్రాక్టీస్, తర్వాత ప్రత్యేక ట్రాక్‌లపై వాస్తవ డ్రైవింగ్ శిక్షణ అందిస్తారు. లైసెన్స్ రకం ప్రకారం శిక్షణ వ్యవధి, ఫీజులు వంటి అంశాలను మోర్త్ నిర్ణయిస్తుంది. డీటీసీల్లో శిక్షణ పూర్తి చేసిన వారికి రవాణాశాఖ వద్ద డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. శిక్షణ పూర్తి సర్టిఫికెట్ ఆధారంగా నేరుగా లైసెన్స్ జారీ చేస్తారు.
Also Read: Ande Sri: అందెశ్రీ మృతి.. ప్రముఖుల దిగ్భ్రాంతి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు
ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు లేదా వ్యక్తులు జిల్లా కలెక్టర్‌కి దరఖాస్తు చేయాలి. కలెక్టర్ ఆ దరఖాస్తులను పరిశీలించి, అర్హతలు, భూమి లభ్యత వంటి అంశాలను పరిశీలించి రవాణాశాఖ కమిషనర్‌కి సిఫార్సు చేస్తారు. కమిషనర్ ఆమోదం అనంతరం మోర్త్‌కు పంపిస్తారు. సాధారణంగా ప్రతి జిల్లాకు రెండు కేంద్రాలు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల నుంచి రెండు చొప్పున, అనంతపురం, కృష్ణా, తిరుపతి, పశ్చిమగోదావరి, బాపట్ల, కాకినాడ జిల్లాల నుంచి ఒక్కో దరఖాస్తు వచ్చాయి. వీటిలో అనంతపురం జిల్లా దరఖాస్తును మోర్త్ ఇప్పటికే ఆమోదించింది. అయితే ఇప్పటివరకు ఆర్‌డీటీసీలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
రవాణాశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, డీటీసీలు, ఆర్‌డీటీసీలకు జనవరి చివరి వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఫిబ్రవరి చివరి నాటికి అన్ని దరఖాస్తులను మోర్త్‌కు పంపిస్తారు. వచ్చే ఏడాది నాటికి ఈ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం.
ఈ కొత్త కేంద్రాల ద్వారా డ్రైవింగ్ శిక్షణను ప్రామాణికంగా మార్చి, లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. సరైన శిక్షణతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, వాహనదారుల భద్రత పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
