APY Scheme: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అటల్ పెన్షన్ యోజన’ (APY) గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపారు. మే 9, 2015న ప్రారంభమైన ఈ పథకం, అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. తాజా నిర్ణయంతో, ఈ పథకం మరో ఐదేళ్ల పాటు (2030-31 వరకు) కొనసాగనుంది. దీనితో పాటు, పథకానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, అవగాహన సదస్సులు,ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. జనవరి 19, 2026 నాటికి అందిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 8.66 కోట్ల మంది పైగా చందాదారులు ఈ పథకంలో చేరారు.
Also Read: AP Liquor Case: ఏపీ మద్యం కేసులో ఊహించని ట్విస్ట్.. ఆ ముగ్గురికి ఇక భయం లేదు!
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 1.20 కోట్ల నమోదులతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. యూపీలోని ప్రయాగ్రాజ్, లక్నో, బరేలీ, ఫతేపూర్, కాన్పూర్ నగర్ జిల్లాలు అత్యధిక నమోదులు సాధించిన జాబితాలో ఉన్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో చేపట్టిన ముమ్మర ప్రచారం వల్ల ఈ స్థాయిలో ప్రజలు భాగస్వాములయ్యారని ప్రభుత్వం తెలిపింది. అటల్ పెన్షన్ యోజనలో సభ్యులుగా ఉన్నవారు 60 ఏళ్లు నిండిన తర్వాత వారు చెల్లించిన చందా (Contribution) ఆధారంగా నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస గ్యారెంటీ పెన్షన్ పొందుతారు. 18 నుండి 40 ఏళ్ల లోపు వారు ఈ పథకంలో చేరవచ్చు. పొదుపు ఖాతా నుండి ఆటో-డెబిట్ ద్వారా నెలవారీ, మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి చందా చెల్లించే వెసులుబాటు ఉంది. ఒకవేళ చందాదారుడు మరణిస్తే, అదే పెన్షన్ వారి జీవిత భాగస్వామికి అందుతుంది. ఇద్దరూ మరణించిన పక్షంలో, జమ అయిన మొత్తం కార్పస్ నిధిని నామినీకి అందజేస్తారు.
