Murali Nayak: ‘ఆపరేషన్ సిందూర్’లో దేశం కోసం ప్రాణాలర్పించి వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన మద్దతును ప్రకటించింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ త్యాగానికి గుర్తింపుగా, మంత్రి సవిత ఆయన తల్లిదండ్రులకు మంగళవారం పరిహారం అందజేశారు.
మంత్రి సవిత కల్లితండాలోని మురళీ నాయక్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అనంతరం ఆయన తల్లిదండ్రులకు రూ. 50 లక్షల చెక్కు, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు సెంట్ల ఇంటి స్థలం పత్రాలను అందజేశారు.
Also Read: Amarnath Yatra 2025: అమర్‌నాథ్ యాత్ర మార్గాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు..
Murali Nayak: ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, గ్రామంలో రూ. 14 లక్షల ఖర్చుతో మురళీ నాయక్ సమాధిని నిర్మిస్తామని, అక్కడికి వెళ్లేందుకు రూ. 16 లక్షలతో సీసీ రోడ్డును కూడా వేయిస్తామని ఆమె హామీ ఇచ్చారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ వీరత్వాన్ని గ్రామస్తులు, అధికారులు ప్రశంసించారు. ప్రభుత్వం అందించిన ఈ సహాయం కుటుంబానికి కొంత ఊరటనిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.