Gemini App: విద్యా రంగాన్ని మరింత స్మార్ట్‌గా మార్చేందుకు టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చింది. అమెరికాలో జరిగిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ (ISTE) సదస్సులో గూగుల్ పెద్ద సంఖ్యలో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా ‘జెమిని ఇన్ క్లాస్ రూమ్’ అనే కొత్త సిరీస్‌ను పరిచయం చేయడం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు వినూత్న అవకాశాలను కల్పించింది.
ఉపాధ్యాయుల కోసం 30కి పైగా AI టూల్స్ :
ఉపాధ్యాయుల పనిని సులభతరం చేయడానికి గూగుల్ 30కి పైగా కొత్త AI టూల్స్‌ను రూపొందించింది. ఈ టూల్స్ సహాయంతో ఉపాధ్యాయులు సులభంగా పాఠ్య ప్రణాళికలు, ఆటోమేటిక్ క్విజ్‌లు, ప్రజెంటేషన్లు, వర్క్‌షీట్‌లను తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా, ప్రాజెక్టు ఆలోచనల కోసం ‘బ్రెయిన్‌స్టార్మింగ్ టూల్స్’ ఉపయోగించుకోవచ్చు. నోట్‌బుక్ ఎల్ఎమ్ (Notebook LM) సహాయంతో స్టడీ గైడ్‌లు, ఆడియో ఓవర్‌వ్యూలను రూపొందించవచ్చు. ఈ టూల్స్ చదువును ఆటలుగా మార్చే సౌలభ్యాన్ని కల్పించడంతో పాటు, ఉపాధ్యాయులు విద్యార్థుల పురోగతిని మరింత సమర్థవంతంగా ట్రాక్ చేయగలుగుతారు. గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్న ప్రకారం, ఈ AI టూల్స్ అన్నీ ‘గూగుల్ వర్క్‌స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్’ యూజర్లకు పూర్తిగా ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. గత ఏడాది గూగుల్ క్లాస్‌రూమ్‌కి జెమిని ఫీచర్స్‌ను చేర్చిన తర్వాత ఇది ఒక పెద్ద అప్‌డేట్‌గా పరిగణించబడుతోంది.
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘జెమిని ఫర్ స్టూడెంట్స్’ యాప్ :
గూగుల్ కేవలం ఉపాధ్యాయులనే కాకుండా, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘జెమిని ఫర్ స్టూడెంట్స్’ యాప్‌ను కూడా విడుదల చేసింది. ఈ యాప్‌లో ‘జెమిని కాన్వాస్’ అనే ఫీచర్ ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన విషయాలపై సొంతగా క్విజ్‌లను తయారు చేసుకోవచ్చు. ఇంటరాక్టివ్ డయాగ్రామ్‌లు, విజువల్స్ సహాయంతో క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
Also Read: Royal Train: చారిత్రక ‘ది రాయల్ ట్రైన్’ సేవలకు ముగింపు: బ్రిటన్ రాజు నిర్ణయం!
భద్రత, గోప్యతకు ప్రాధాన్యత :
పిల్లల భద్రత, గోప్యతకు గూగుల్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొంది. పిల్లల చాట్స్ ఆధారంగా AI మోడల్‌ను ట్రైన్ చేయదని స్పష్టం చేసింది. అలాగే, ‘చైల్డ్ సేఫ్టీ’ నిపుణుల సూచనలతోనే ఈ టూల్స్‌ను రూపొందించామని గూగుల్ తెలిపింది.
ఈ కొత్త ఫీచర్లు మొదట అమెరికాలోని K-12 (కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు), స్టేట్ లెర్నింగ్ స్టాండర్డ్స్‌కు అందుబాటులోకి రానున్నాయి. అనంతరం ఇతర దేశాల ప్రమాణాలను కూడా ఇందులో చేర్చనున్నారు. విద్యా సంస్థలు తమ సొంత లెర్నింగ్ స్టాండర్డ్స్‌ను కూడా గూగుల్ క్లాస్‌రూమ్ క్లాస్‌మేట్ ద్వారా ప్రచురించుకునే అవకాశం ఉంటుంది. గూగుల్ ఈ ఆవిష్కరణల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు విద్యా బోధన, అభ్యాస ప్రక్రియలను మరింత సమర్థవంతంగా, ఆసక్తికరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.