Sundar Pichai

Sundar Pichai: సుందర్ పిచాయ్ ట్వీట్: విశాఖపట్నంలో గూగుల్ AI హబ్! దేశంలో టెక్నాలజీకి కొత్త మైలురాయి

Sundar Pichai: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌ను భారతదేశంలోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం కుదిరిన తర్వాత, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.

విశాఖలో గూగుల్ ప్రణాళికలను ప్రధానితో పంచుకున్న తర్వాత, సుందర్ పిచాయ్ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో మాట్లాడటం తనకు సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు.

విశాఖపట్నంలో గూగుల్ తొలి ఏఐ హబ్ ఏర్పాటు ప్రణాళికలను ప్రధాని మోదీతో పంచుకున్నాను. ఈ హబ్ రాబోయే రోజుల్లో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఇక్కడ 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌, సముద్రం లోపల కేబుల్ ద్వారా అనుసంధానం చేసే (సబ్‌సీ గేట్‌వే), భారీ ఇంధన సదుపాయాలు ఉంటాయి. ఈ హబ్ ద్వారా అధునాతన సాంకేతికతను దేశంలోని వ్యాపారాలకు, ప్రజలకు అందిస్తాం. దీనివల్ల దేశవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) ఆవిష్కరణలను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవకాశం కలుగుతుంది.

Also Read: Pawan Route Map for Vijay TVK: టీవీకే పార్టీకి పవన్‌ రూట్‌ మ్యాప్‌.. విజయ్‌కి మరోదారి కష్టం!

భారతదేశంలో అతిపెద్ద పెట్టుబడి
ఈ భారీ ప్రాజెక్టు కోసం గూగుల్ సంస్థ రాబోయే ఐదేళ్లలో దాదాపు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 125,000 కోట్లు) భారీ పెట్టుబడి పెట్టనుంది. భారతదేశంలో గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం.

విశాఖపట్నం ఇకపై కేవలం పోర్ట్ సిటీ మాత్రమే కాకుండా, గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా మారుతుందని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ తెలిపారు. ఈ కేంద్రం ద్వారా విశాఖను 12 దేశాలతో సముద్ర గర్భ కేబుల్ ద్వారా అనుసంధానం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ AI హబ్ ఏర్పాటుతో భారత్‌లో సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *