New Year 2026: కాలచక్రంలో మరో ఏడాది కనుమరుగువుతోంది. 2025కి వీడ్కోలు పలుకుతూ, సరికొత్త ఆశలతో 2026కి స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాలు ముస్తాబయ్యాయి. ముఖ్యంగా భాగ్యనగరం నూతన సంవత్సర వేడుకల కోసం విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోతోంది. నగరంలోని ప్రధాన పబ్బులు, రిసార్టులు, ఈవెంట్ సెంటర్లు ఇప్పటికే యువతను ఆకర్షించేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగే ఈ సంబరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంటే, మరోవైపు గిగ్ వర్కర్లు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు నగరావ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
సాధారణంగా నూతన సంవత్సర వేడుకలంటే మద్యం విందులు, విందు వినోదాలు సహజం. అయితే, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, ఇతరుల భద్రతను కూడా ప్రమాదంలో పడేసే ధోరణిని అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేస్తూ, పట్టుబడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరుణంలో నగరవాసులకు ఒక ఊరటనిచ్చే వార్తను తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) మోసుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Vishwambhara: విశ్వంభర విడుదలయ్యేది ఎప్పుడంటే?
మద్యం సేవించిన వారు క్షేమంగా ఇంటికి చేరేలా ఉచిత రైడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు సలావుద్దీన్ వెల్లడించారు. ఈ ఏడాది ‘బిజ్లీరైడ్’ సంస్థతో చేతులు కలిపి సుమారు 500 వాహనాలతో ఈ భారీ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ఆటోలు, క్యాబ్స్ తో పాటు ఈవీ బైక్ లు కూడా అందుబాటులో ఉండటం విశేషం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్న వారందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
ముఖ్యంగా బుధవారం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట వరకు ఈ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి. మద్యం మత్తులో ఉండి వాహనాలు నడపలేని స్థితిలో ఉన్నవారు 89770 09804 నంబర్‌కు కాల్ చేస్తే చాలు, గిగ్ వర్కర్ల టీమ్ మిమ్మల్ని సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరుస్తుంది. కేవలం సంబరాలు చేసుకోవడమే కాదు, బాధ్యతాయుతంగా వ్యవహరించడం కూడా ముఖ్యమని చాటిచెప్పేలా ఈ నిర్ణయం ఉంది. కాబట్టి ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఆనందంగా గడపండి, కానీ అతిగా తాగి స్వీయ నియంత్రణ కోల్పోకండి. పోలీసుల నిబంధనలను గౌరవిస్తూ, అవసరమైతే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వాడుకుని మీ ఇంటికి సురక్షితంగా చేరండి.
