8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెబుతూ కేంద్ర కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఒక కోటి పదిహేను లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారుల జీతాలు, పెన్షన్లను సమీక్షించి, పెంచేందుకు వీలుగా 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ రంజనా దేశాయ్
ఈ కొత్త వేతన సంఘానికి ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. ఈ కమిషన్‌లో ఛైర్‌పర్సన్‌తో పాటు ప్రొఫెసర్ పులక్ ఘోష్, పంకజ్ జైన్‌లు సభ్యులుగా ఉంటారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం కాలపరిమితి 2026 జనవరితో ముగుస్తున్న నేపథ్యంలో, ఆ తర్వాత కొత్త వేతన సవరణలను అమలు చేసేందుకు వీలుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: Karnataka: కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ!
ఎప్పుడు అమలులోకి వస్తుంది?
8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన అన్ని విధివిధానాలను (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ కమిషన్ ఏర్పడిన తేదీ నుంచి 18 నెలల్లోపు తన నివేదికను, సిఫార్సులను కేంద్ర కేబినెట్‌కు సమర్పించనుంది. ఈ సిఫార్సుల ఆధారంగానే జీతాలు, పెన్షన్లు సవరించబడతాయి. ఈ కొత్త సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్ల వేతనాలు, భత్యాలను నిర్ణయించడంలో ఈ సంఘం ముఖ్యపాత్ర పోషిస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి వ్యయం, సంక్షేమ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతభత్యాలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత జీతాలు ఎంత పెంచాలో ఈ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.
రబీ సీజన్ రైతులకు కూడా గుడ్‌న్యూస్
కేంద్ర కేబినెట్ ఈ సమావేశంలో ఉద్యోగులకే కాకుండా రైతులకు కూడా శుభవార్త చెప్పింది. రబీ సీజన్‌కు సంబంధించి ఫాస్పెటిక్, పొటాషిక్, డీఏపీ ఎరువుల సబ్సిడీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఎరువుల సబ్సిడీల కోసం కేంద్రం దాదాపు ₹ 37,952 కోట్లు ఖర్చు చేయనుంది.

