AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోట్లాది మంది రైతన్నలకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం రెండో విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధమైంది. కేంద్రం అందించే ‘పీఎం కిసాన్’ నిధులు కూడా అదే రోజు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో ఏపీ రైతులకు ఒకేసారి డబుల్ లబ్ధి చేకూరనుంది. ఈ నెల 19వ తేదీన కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఒక్కో రైతుకు రూ. 7 వేలు.. మొత్తం రూ. 3,077 కోట్ల సాయం.
ఈ రెండో విడతలో మొత్తం 46,62,904 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
రాష్ట్ర ప్రభుత్వం (అన్నదాత సుఖీభవ): రూ. 5,000/-
కేంద్ర ప్రభుత్వం (పీఎం కిసాన్): రూ. 2,000/-
రైతుకు అందే మొత్తం: ఒక్కొక్కరికి రూ. 7,000/-
రెండు పథకాల కింద మొత్తం రూ. 3,077.77 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. ఎన్నికల హామీలో భాగంగా, ఈ స్కీమ్‌ల ద్వారా మొత్తంగా రూ. 20 వేలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Pawan Kalyan: ఐబొమ్మ అరెస్టు ఆపరేషన్‌పై సజ్జనార్ బృందానికి పవన్ కల్యాణ్ ప్రశంసలు
అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు
నిధుల విడుదలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. చనిపోయిన రైతుల వారసులకు పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. NPCA(National Payments Corporation of India) లో ఇన్-యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను వెంటనే యాక్టివేట్ చేయాలని సూచించారు. అర్హత ఉన్న రైతులు సులభంగా రిజిస్టర్ చేసుకునేందుకు ఆన్‌లైన్ వ్యవస్థను మరింత సులభతరం చేయాలని అధికారులకు సూచించారు. ఆధార్ మ్యాపింగ్ వంటి సాంకేతిక సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు ఉన్న రైతులు రైతు సేవా కేంద్రాలు లేదా మీ సేవ కేంద్రాల్లో సంప్రదించి తమ స్టేటస్‌ను తెలుసుకుని, సమస్యలను పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రైతే బలం కాబట్టి, అర్హులైన ప్రతి రైతుకూ పథకం లబ్ధి అందేలా సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
