Gondu Shankar: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం తహసిల్దార్ కార్యాలయంలో గార మండల ప్రజల నుంచి వినతల స్వీకరణ కార్యక్రమం ప్రజా దర్బార్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలన కారణంగా గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయన్నారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్తు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
Gondu Shankar: దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో వేలాదిగా గ్రామసభలు నిర్వహించి పల్లెల్లోని సమస్యలను గుర్తించడం జరిగిందన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఆయా సమస్యల పరిష్కారానికి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపనలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. త్వరలోనే గ్రామాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొనే దిశగా కొనసాగుతామన్నారు. ప్రజా దర్బారు కార్యక్రమానికి వేలాదిగా వినతులు వస్తుండడం చూస్తుంటే గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్య ధోరణి కి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు తోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. గ్రామ స్వరాజ్య పాలన కోసం గాంధీజీ కలలు కన్నా ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గార మండల టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.