Hyderabad: బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో, కొందరు మోసగాళ్లు ఆ బంగారాన్నే అడ్డం పెట్టుకుని సులభంగా డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ముగ్గురు మహిళలు తెలివిగా ఓ జ్యువెలరీ షాప్ యజమానిని బురిడీ కొట్టించి, నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని ఉడాయించారు.
ఆటోలో వచ్చి, బురఖా ధరించి.. ప్లాన్ ప్రకారం!
శుక్రవారం రోజున ముగ్గురు మహిళలు బురఖా ధరించి ఆటోలో రాజేంద్రనగర్‌లోని ఒక జ్యువెలరీ షాప్ వద్దకు వచ్చారు. వారికి డబ్బు అత్యవసరంగా అవసరం ఉందని, అందుకే ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాలనుకుంటున్నామని షాప్ యజమానిని నమ్మించారు. అప్పటికే బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో, యజమాని ఆ బంగారానికి గాను రూ. 1,70,000 చెల్లిస్తానని చెప్పాడు. మహిళలు అందుకు అంగీకరించి, తమ ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసి యజమానికి ఇచ్చారు.
ఆన్‌లైన్‌లో పేమెంట్.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్!
బంగారం తీసుకున్న షాప్ యజమాని, మహిళలకు ముందుగా రూ. 1,40,000 నగదు ఇచ్చాడు. మిగిలిన రూ. 30 వేలు ఫోన్ పే ద్వారా పంపిస్తానని చెప్పాడు. మహిళలు వెంటనే ఒక ఫోన్ పే నంబర్‌ను ఇవ్వగా, యజమాని ఆ నంబర్‌కు రూ. 30 వేలు బదిలీ చేశాడు. డబ్బులు అందగానే, ఆ ముగ్గురు మహిళలు షాప్ నుంచి హుటాహుటిన వెళ్లిపోయారు. అయితే, వారు వెళ్లిన కొద్దిసేపటికే షాప్ యజమాని బంగారాన్ని సరిగా పరిశీలించగా అది నకిలీదని తేలింది! తాను మోసపోయానని గ్రహించిన యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
పోలీసుల రంగ ప్రవేశం: సీసీ ఫుటేజ్, ఫోన్ నంబర్ ట్రేసింగ్
వెంటనే షాప్ యజమాని, తాను ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిన ఫోన్ పే నంబర్‌కు ఫోన్ చేయగా ఆ నంబర్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఇంకేముంది, మోసపోయానని నిర్ధారించుకున్న యజమాని వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మోసంపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ ముగ్గురు మహిళలను గుర్తించేందుకు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అలాగే, వారు డబ్బు పంపిన ఫోన్ పే నంబర్‌ను కూడా ట్రేస్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

