Gold Soil Scam

Gold Soil Scam: బంగారు ఇసుక.. ఐదు బస్తాలు జస్ట్ 68 లక్షలు మాత్రమే.. నిండా ముంచేశారు!

Gold Soil Scam: మోసాలు చేయడం మోసగాళ్లకు అలవాటైన సులువైన పని. అత్యాశకు పోయి మోసపోవడం అమాయకులకు సాధారణమైన విషయం. రైస్ పుల్లింగ్ అంటారు.. బ్లాక్ మనీ వైట్ అంటారు.. పురాతన విగ్రహాలంటారు.. ఒక్కటి కాదు మోసానికి ఎన్నో వేషాలు. ఎన్నో రంగులు.. మరెన్నో విధానాలు. టార్గెట్ ఒక్కటే.. డబ్బు సంపాదించాలని ప్రయత్నాలు చేసే అమాయకులను ముంచేయడమే. ఇదిగో తాజాగా అలాంటి మోసం ఒకటి బయటపడింది. బంగారం కలిసిన ఇసుక అని చెప్పి 68 లక్షలు దోచేశారు మోసగాళ్లు. ఆ వివరాలు తెలుసుకుందాం.

బంగారు రేణువులు కలిపిన మట్టి అని చెప్పి, తమిళనాడులోని నామక్కల్‌కు చెందిన స్వర్ణకారులకు కేవలం ఇసుకను రూ.68 లక్షలకు విక్రయించినందుకు గుజరాత్‌కు చెందిన నలుగురు వ్యక్తులను నిన్న కేరళలో అరెస్టు చేశారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సందీప్ హస్ముఖ్ (37), విపుల్ మంజీ (43), ధర్మేష్ భాయ్ (38), కృపేష్ భాయ్ (35) అనే నలుగురు కేరళలోని కొచ్చి సమీపంలోని పలరివట్టం ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని బంగారు రేణువులు కలిపిన ఇసుకను అమ్ముతున్నామని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న తమిళనాడులోని నామక్కల్ నుండి కొంతమంది స్వర్ణకారులు వారిని సంప్రదించారు.

Gold Soil Scam: బంగారు ఆభరణాల కర్మాగారం నుండి బంగారు కణాలు కలిపిన మట్టిని సేకరించామని ఆ ముఠా వారికి చెప్పింది. 500 బస్తాలలో బంగారు ఇసుక ఉందని చెప్పి, గుజరాత్ ముఠా కార్మికులకు నమూనాల కోసం 5 కిలోల ఇసుకను ఇచ్చింది. దీని టెస్టింగ్ కోసం ఏర్పాట్లు ఆ ముఠా చేసింది.

అక్కడ ఒక టేబుల్ ఉంచి దానిపై ఇసుక వేసి దానిని టెస్ట్ చేసుకోమని స్వర్ణకారులకు ఈ గ్యాంగ్ చెప్పింది. దానిని పరీక్షించిన వారికి ఆ ఇసుకలో బంగారం ఉన్నట్టుగా తేలింది. ఇసుకలో బంగారం ఉందని నమ్మి, 5 టన్నుల ఇసుకకు 50 లక్షల రూపాయల నగదు, 18 లక్షల రూపాయల చెక్కును దుండగులకు సమర్పించుకున్నారు. తరువాత భలే మంచి చౌక బేరమూ అని పాడుకుంటూ ఈ స్వర్ణకారులు తమ ఊరికి వెళ్లిపోయారు. అక్కడకు వెళ్లి ఐదు బస్తాలను విప్పి చూడగా కనీసం ఇంటి నిర్మాణానికి కూడా పనికిరాని ఇసుక వాటిలో ఉంది. దీంతో తాము దెబ్బతిన్నామని అర్ధమైన వారు లబోదిబో అంటూ పలరివట్టం పోలీసులను ఆశ్రయించారు.

Also Read: TDP Formation Day: నేడు టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. వేడుకల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

Gold Soil Scam: ఇలా నమ్మించారు..
ఇంతకీ టేబుల్ పై టెస్ట్ చేసిన ఇసుకలో బంగారం ఎలా వచ్చింది? ఈ విషయంపై పోలీసులు కూపీ లాగారు. ఈ మోసగాళ్లు టేబుల్ కు చిన్న రంధ్రం చేసి.. దాని నుంచి సిరెంజ్ ద్వారా గోల్డ్ లిక్విడ్ ఇసుకలోకి ఇంజెక్ట్ చేశారు. సరిగ్గా ఈ గోల్డ్ లిక్విడ్ ఇంజక్ట్ అయిన ప్రదేశం నుంచి ఇసుక సాంపిల్ తీసుకుని స్వర్ణకారులు టెస్ట్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. అంతే.. స్వర్ణకారులకు అది బంగారం అనే రిజల్ట్ వచ్చింది.

ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన కేరళ పోలీసులు మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. ఈ ముఠా గతంలోనూ కేరళలోని ఎర్నాకుళం, తమిళనాడులోని సెంతమంగళంలలో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారణ ప్రారంభించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *