Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఉత్సాహం మొదలైన వేళ, బంగారం మరియు వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పండుగ పూట నగలు కొందామనుకున్న వారికి ఈ పెరుగుదల పెద్ద షాక్ అనే చెప్పాలి. కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టకపోగా, ప్రతిరోజూ కొత్త గరిష్టాలను తాకుతున్నాయి.
హైదరాబాద్‌లో నేటి ధరల పరిస్థితి
భాగ్యనగరంలో సోమవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల (శుద్ధ బంగారం) 10 గ్రాముల ధర ఏకంగా 1,44,800 రూపాయలకు చేరింది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,34,160 రూపాయల వద్ద కొనసాగుతోంది. కేవలం ఒక్క రోజులోనే వెయ్యి రూపాయలకు పైగా ధర పెరగడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Traffic Rush: భోగికి ముందే రోడ్లపై సెగలు.. విజయవాడ హైవేపై వాహనాల వెల్లువ!
వెండి ధరల జోరు.. ఆగుతుందా?
బంగారం కంటే వెండి ధరల్లో పెరుగుదల మరీ ఆశ్చర్యకరంగా ఉంది. కిలో వెండి ధర ఇప్పుడు 2,87,000 రూపాయల మార్కును తాకింది. గత మూడు రోజుల్లోనే కిలో వెండిపై సుమారు 19,000 రూపాయలు పెరగడం గమనార్హం. 2025 ఏప్రిల్ సమయంలో 90 వేల రూపాయల వద్ద ఉన్న వెండి, ఏడాది తిరగకముందే రెండున్నర లక్షలు దాటిపోయింది. అంటే గత ఏడాది కాలంలో వెండి ధరలు ఏకంగా 150 శాతం పెరిగాయన్నమాట.
ముందు ముందు మరిన్ని పెరుగుదలలు?
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రముఖ ఆర్థిక సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా ప్రకారం, 2026 నాటికి వెండి ధర ఏకంగా 3,20,000 రూపాయల వరకు వెళ్లే అవకాశం ఉంది. పండుగ సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం, అదే సమయంలో సరఫరా తగ్గడం వంటి కారణాల వల్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముదుపుదారులు బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతుండటంతో రానున్న రోజుల్లో సామాన్యుడికి ఈ లోహాలు మరింత దూరమయ్యేలా కనిపిస్తున్నాయి.
