Gold Price Today: గత కొద్దిరోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ఆదివారం నాడు కాస్త శాంతించాయి. నిరంతరం పెరుగుతూ రికార్డులు సృష్టిస్తున్న పసిడి ధరల్లో ఈరోజు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. వెడ్డింగ్ సీజన్ కావడంతో బంగారం కొనాల్సిన అవసరం ఉన్నవారికి, ఈ ధరల పెరుగుదల గత వారం రోజులుగా పెద్ద తలనొప్పిగా మారింది. అయితే, నేడు ధరలు పెరగకపోవడంతో కొనుగోలుదారులు కొంతమేర ఊపిరి పీల్చుకుంటున్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల బంగారం ధరల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 7.95 డాలర్లు పెరిగి 4340 వద్ద ట్రేడ్ అవుతుండగా, వెండి ధర కూడా 1.85 డాలర్ల మేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో రేట్లు పెరుగుతున్నప్పటికీ, మన దేశీయ మార్కెట్లో మాత్రం ఆదివారం సెలవు దినం కావడంతో ధరలు నిలకడగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో ఈరోజు ధరల వివరాలు చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,180 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,000 వద్ద ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతుండగా, తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,35,280గా నమోదైంది.
మరోవైపు వెండి ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 2,26,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా వెండి ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ధరలు స్థిరంగా ఉన్న ఈ సమయంలోనే కొనుగోలు చేయడం ఉత్తమమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, బంగారంపై పెట్టుబడి పెట్టేవారు రోజువారీ మార్పులను గమనిస్తూ ఉండటం చాలా అవసరం.
