Gold Man

Gold Man: హైదరాబాద్‌లో మరో ‘గోల్డ్ మాన్’ గుట్టురట్టు.. రూ. 1 కోటి విలువైన బంగారం స్వాధీనం!

Gold Man: హైదరాబాద్‌లో భారీగా బంగారం ధరిస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే మరో ‘గోల్డ్ మాన్’ చిక్కుల్లో పడ్డాడు. యాదగిరి చిన్న గౌడ్ అనే వ్యక్తి వద్ద ఉన్న సుమారు రూ. 1 కోటి విలువైన బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన వద్ద ఉన్న మొత్తం 900 గ్రాముల బంగారంలో, సుమారు 700 గ్రాములకు సంబంధించి ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత వినియోగం కింద పరిగణించి కేవలం 150 నుంచి 200 గ్రాములను మాత్రమే ఆయనకు తిరిగి ఇచ్చారు.

ఈ కేసులో ఒక కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 247 కింద జారీ చేసిన తొలి వారెంట్ ఇదే కావడమే. గతంలో పాత చట్టం ప్రకారం చర్యలు తీసుకునేవారు, కానీ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. టీవీ ఇంటర్వ్యూలు, యూట్యూబ్ వీడియోల్లో ఆయన ప్రదర్శించిన బంగారాన్ని చూసి, ‘సోషల్ ప్రొఫైలింగ్’ ద్వారా ఐటీ శాఖ ఈ విచారణ మొదలుపెట్టడం విశేషం.

నిజానికి చిన్న పహిల్వాన్ కంటే ముందు కూడా కొందరు ఇలాగే దొరికిపోయారు. కొండా విజయకుమార్ వద్ద గతంలో బంగారం స్వాధీనం చేసుకోగా, మరో కేసులో ‘సూర్య భాయ్’ ధరించిన నగలు అసలైనవి కావని, కేవలం కోటెడ్ లేదా రోల్డ్ గోల్డ్ అని తేలింది. అయితే చిన్న పహిల్వాన్ విషయంలో మాత్రం అది నిజమైన బంగారమని నిర్ధారణ అయ్యింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అద్దె ఆదాయం ద్వారా ఈ బంగారం కొన్నట్లు ఆయన చెప్పినప్పటికీ, ఆ ఆదాయానికి సంబంధించిన ఆధారాలు చూపడంలో ఆయన విఫలమయ్యారు.

చిన్న పహిల్వాన్ గచ్చిబౌలి ప్రాంతంలో వ్యాపారిగా, రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నారు. భూముల క్రయవిక్రయాల్లో నగదు రూపంలో లావాదేవీలు చేస్తూ, లెక్కల్లో చూపకుండా ఈ ఆభరణాలు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యుల ఆదాయ వనరులపై కూడా నిఘా పెట్టిన అధికారులు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. విలాసవంతమైన జీవితం, భారీ బంగారు ఆభరణాలతో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించిన ఈ ‘తెలంగాణ గోల్డ్ మాన్’ చివరకు ఐటీ శాఖకు దొరికిపోవడం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *