Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ నిరాశే ఎదురవుతోంది. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు, మార్చి 27న ఒక్కసారిగా మళ్లీ పుంజుకున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు రూ.2,000 వరకు ధర పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి కారణాల వల్ల మార్కెట్లో బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,540గా ఉంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,32,490 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర కొంచెం ఎక్కువగా రూ.1,44,690గా ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ.1,45,630 పలుకుతోంది. ముంబై, బెంగళూరు, కేరళలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
కేవలం బంగారమే కాకుండా వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,59,900 వద్ద ఉండగా, ఢిల్లీ మరియు ముంబైలో రూ.2,49,900 వద్ద విక్రయించబడుతోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఇలా ధరలు అమాంతం పెరగడం వినియోగదారులకు భారంగా మారింది. రానున్న రోజుల్లో ధరలు ఇంకా ఏ స్థాయికి చేరుతాయోనని జనం కంగారు పడుతున్నారు.
