Gold Price Today: ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం సామాన్యుల జేబుకు చిల్లు పెడుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం నేరుగా బంగారం, వెండి ధరలపై పడుతోంది. మంగళవారం ఉదయం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న కొనుగోలుదారులకు, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ధరలు మళ్ళీ పుంజుకొని షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల వల్ల మన దేశంలోనూ పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
హైదరాబాద్‌లో తాజా ధరలు:
భాగ్యనగరంలో బంగారం ధరలు భారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మంగళవారం ఉదయం రూ.1,61,670 గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల ధర, కేవలం కొన్ని గంటల్లోనే పెరిగి రూ.1,62,380కి చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,850 వద్ద కొనసాగుతోంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పరిస్థితి:
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,530గా ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ.1,64,180 వద్ద నమోదైంది. ముంబై, బెంగళూరు, పూణె వంటి నగరాల్లో హైదరాబాద్‌కు సమానంగా ధరలు ఉన్నాయి. ఎక్కడ చూసినా బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్తుండటంతో శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం సద్దుమణిగితే తప్ప ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వెండి ధరల్లో రికార్డు స్థాయి పెరుగుదల:
బంగారం కంటే వెండి ధర మరింత వేగంగా దూసుకుపోతోంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో కిలో వెండి ధర రూ.2,79,900 ఉండగా, ఉదయం 10 గంటల సమయానికి అది ఏకంగా రూ.2,90,000కి చేరుకుంది. అంటే కేవలం 4 గంటల్లోనే కిలో వెండిపై రూ.10,000 పెరగడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,00,000 మార్కును తాకి రికార్డు సృష్టించింది. మదుపర్లు బంగారం కంటే వెండిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటం కూడా ఈ పెరుగుదలకు ఒక కారణమని తెలుస్తోంది.
