Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త.. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు మెల్లమెల్లగా దిగివస్తున్నాయి. డిసెంబర్ చివరి వారంలో చుక్కలు చూపించిన ధరలు, జనవరి ప్రారంభంలో తగ్గుముఖం పట్టడం సామాన్యులకు పెద్ద ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
ప్రస్తుత ధరల విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా పసిడి ధరల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనవరి 3వ తేదీ నాటికి, మన దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,210 పలుకుతోంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,860 వద్ద కొనసాగుతోంది. గత నెలలో రూ. 1.42 లక్షల మార్కును దాటిన ధరలు ఇప్పుడు దాదాపు ఆరు వేల రూపాయల వరకు తగ్గడం గమనార్హం.
బంగారంతో పాటు వెండి కూడా భారీగానే దిగివచ్చింది. ఇటీవల కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ. 2.70 లక్షల వరకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం వెండి ధర భారీగా క్షీణించి కిలో రూ. 2,42,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధరల్లో ఈ స్థాయిలో తగ్గుదల రావడం వెండి వస్తువులు, నగలు కొనాలనుకునే వారికి మంచి అవకాశంగా కనిపిస్తోంది.
ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలు:
మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడలో ధరలు ఒకే విధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం రూ. 1,36,210 గా ఉంటే, 22 క్యారెట్ల ధర రూ. 1,24,860 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ. 1,36,390 వద్ద కొంచెం ఎక్కువగా ఉంది. ఇక చెన్నైలో అత్యధికంగా రూ. 1,37,250 పలుకుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో కూడా హైదరాబాద్ తరహా ధరలే కొనసాగుతున్నాయి.
